వరకట్న రక్కసికి మరో మహిళ బలైపోయింది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేక ఓ మహిళా ప్రభుత్వోద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్‌లో వీఆర్ఏగా పని చేస్తోన్న నాగమణి కొన్నేళ్ల క్రితం లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మారుతితో పెళ్లయ్యింది.

కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత అతని అసలు రూపం బయటకు వచ్చింది. తనకు మరింత కట్నం కావాలంటూ భర్యను ప్రతిరోజూ వేధింపులకు గురిచేసేవాడు. అతని వేధింపులు తాళలేక నాగమణి మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది.

దీనిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు నాగమణిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన అక్క పరిస్ధితికి బావ మారుతే కారణమని భావించిన నాగమణి తమ్ముడు అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో అతనిపై మారుతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగమణి మరణించడంతో ఆమె తల్లిదండ్రుల్లో ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మారుతి పాస్‌పోర్ట్‌ వెంటనే సీజ్ చేయాలని లేదంటే అతను దేశం విడిచి పారిపోతాడని కుటుంబసభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.