నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఆరుబయట పడుకున్న అన్నదమ్ములను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం హాజరుగూడెంలో చోటు చేసుకుంది. మృతులను జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజిలుగా గుర్తించారు. 

వారి మరో సోదరుడు హరిపై కూడా దాడి చేయడానికి వారు ప్రయత్నించారు. అయితే అతను తృటిలో తప్పించుకున్నాడు. ఏడాది క్రితం అక్రమ సంబంధం నేపథ్యంలో హజారిగూడెం గ్రామానికి వెళ్లి వస్తున్న రేవంత్ అనే యువకుడిని హత్య చేసిన కేసులో హతులు నిందితులు. 

ఆ కేసులో జైలుకు వెళ్లిన ముగ్గురు సోదరులు ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు. హత్యకు గురైన యువకుడు హరి అనే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో ముగ్గురు అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఆ క్రమంలోనే హత్యకు గురైన యువకుని తల్లి, మరో ఇద్దరి సాయంతో ప్రతీకారంగా ముగ్గురిని చంపడానికి పథక రచన చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఘటనలో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మరణించగా, హరి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.