హైదరాబాద్: ఎర్రమంజిల్ వద్ద  ఉన్న భవనాలు, తెలంగాణ సచివాలయ భవనాలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూల్చివేయకూడదని హైకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

సచివాలయ భవనం, ఎర్రమంజిల్ వద్ద భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు గత నెల 27న  కొత్త భవనాల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.

తెలంగాణ సచివాయలం, అసెంబ్లీలకు కొత్త భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చివేయడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని  విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ తరుణంలో సోమవారం నాడు దాఖలైన పిటిషన్‌ను  కోర్టు విచారణ  చేసింది. అయితే ఈ విచారణ సమయంలో కౌంటర్ కోసం గడువు కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు ఆ తర్వాత నేరుగా వాదనలు విన్పిస్తామని ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో  ఈ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ జరగనుంది.

అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎర్రమంజిల్ వద్ద ఉన్న భవనాలు, తెలంగాణ సచివాలయం భవనాలను కూల్చివేయవద్దని  కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్‌పై  మధ్యాహ్నం  2:15 గంటలకు హైకోర్టు విచారణను ప్రారంభించింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైద్రాబాద్‌లో  ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్  నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.  చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు వందేళ్లు దాటితే వాటిని కూల్చేందుకు వీల్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.

ఎర్రమంజిల్‌లోని భవనాలను  జాతీయ సంపదగా గుర్తించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే తమ వద్ద పూర్తి వివరాలు లేవని  పూర్తి వివరాలు సమర్పిస్తామని  పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సరిపోయిన భవనాలు ఇప్పుుడు ఎందుకు సరిపోవడం లేదని  ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకే  కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చాడు.