Smita Sabharwal: అత్యంత కీలకమైన నీటి పారుదల శాఖకు కార్యదర్శి ఉన్నట్టా? లేనట్టా?
రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈ శాఖకు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఈ శాఖ బాధ్యతలను అదనంగా కలిగిన ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ మాత్రం.. ఈ శాఖకు సంబంధించిన పలు సమావేశాలకు దూరంగా ఉండటం చర్చను లేవదీసింది.
వ్యవసాయం ప్రధానంగా గల రాష్ట్రాల్లో నీటి పారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. తెలంగాణలోనూ నీటి పారుదల శాఖకు గణనీయమైన ప్రాధాన్యత ఉన్నది. గత ప్రభుత్వంలో ఈ శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఈ శాఖ ఆధ్వర్యంలోనే కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. ఇతర శాఖల్లాగే నీటి పారుదల శాఖకూ కార్యదర్శి ఉంటారు. ఈ శాఖకు గల ప్రాధాన్యత దృష్ట్యా నీటి పారుదల శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారులనే కార్యదర్శిగా ప్రభుత్వం నియమిస్తుంది. కానీ, ఇప్పుడు ఈ శాఖకు అసలు కార్యదర్శి ఉన్నారా? లేరా? అనే విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సభర్వాల్‌కు మంచి ప్రాధాన్యత దక్కింది. అందుకే ఆమె ఏకంగా సీఎం పేషీలో విధులు నిర్వర్తించారు. నీటి పారుదల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎష్ అధికారి రజత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, ఆయన గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేశారు. దీంతో సీఎం కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్‌కు నీటి పారుదల శాఖను అదనపు బాధ్యతలుగా అప్పగించారు.
నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసినప్పుడు ఆమె పలు ప్రాజెక్టులను సందర్శించారు. అవసరమైతే హెలికాప్టర్‌లోనూ ఆమె పర్యటనలు చేశారు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు హెలికాప్టర్‌లలో పర్యటనలు చేయరు. నీటి పారుదల శాఖకు స్మితా సభర్వాల్ అదనపు బాధ్యతలు చేపడుతున్న సమయంలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నీటి పారుదల శాఖకు మంత్రిగా సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
Also Read: Corona Cases: వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. నిన్నటి కంటే రెట్టింపు కేసులు నమోదు
నీటి పారుదల శాఖా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే ఉత్తమ్ కుమార్ జలసౌధలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సందర్భంగా పలు మార్లు ఆయన ఇంజినీర్లతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కూడా సమీక్ష నిర్వహించారు. కానీ, ఇందులో ఏ భేటీకీ స్మితా సభర్వాల్ హాజరు కాలేదు. దీంతో నీటి పారుదల శాఖకు కార్యదర్శి ఉన్నారా? లేరా? అనే సంశయం వచ్చింది.
స్మితా సభర్వాల్.. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీకి ప్రత్యర్థ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేశారు. కానీ, స్మితా సభర్వాల్‌ను మాత్రం కదపలేదు. ఆమెను లూప్ లైన్‌లోనే ఉంచారు.
సెక్రెటేరియట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్మితా సభర్వాల్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు గానీ.. మంత్రితో డాక్యుమెంటపై మాత్రం ఈఎన్సీ మురళీధర్ సంతకం చేయించారు. కానీ, ఆ తర్వాత ఆమె మళ్లీ నీటి పారుదల శాఖలో ముఖ్యమైన బాధ్యతలపై చర్చించినట్టు సమాచారం లేదు. ఒక వేళ ఆమె కార్యదర్శిగా లేకున్నా.. మరో ఐఏఎస్ అధికారిని అయినా.. ఇంకా నీటి పారుదల శాఖకు నియమించకపోవడంపైనా చర్చ జరుగుతున్నది.