Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌కు శంకర్‌నాయక్ గుడ్‌బై..? కారుకు ఉద్యమకారులు దూరమవుతున్నారా..?

ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన డాక్టర్ శంకర్ నాయక్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

doctor shankar nayak quits from trs
Author
Kothagudem, First Published Oct 8, 2018, 1:32 PM IST

ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన డాక్టర్ శంకర్ నాయక్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన శంకర్ నాయక్.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన వైద్యశాలలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు... తొలి నుంచి తెలంగాణావాదాన్ని బలంగా వినిపించిన శంకర్‌.. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కేసీఆర్‌ను అమితంగా ఇష్టపడే ఆయన రాష్ట్ర ఆవిర్భావం.. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు సానుభూతిపరుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తూ వస్తున్న ఆయన కేసీఆర్‌ వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. అందులో తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి.. అసలైన ఉద్యమకారులను టీఆర్ఎస్ నేతలు అణగదొక్కుతున్నారని తద్వారా తమ లాంటి వారు మానసికంగా వేదన అనుభవిస్తున్నారని శంకర్ నాయక్ ప్రకటనలో తెలిపారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి నిజమైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని.. పార్టీలో సామాజిక న్యాయం లేదని.. ఉద్యమకారులను పక్కనబెట్టి... అసలు ఉద్యమంలోనే పాల్గొనని నేతలకు కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని శంకర్‌నాయక్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఏకపక్షమైన విధానాలతో తాము మనస్తాపం చెందామని.. తనతో పాటు పలువురు ఉద్యమకారులు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారని శంకర్ నాయక్ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios