ఒకరికి బదులుగా మరొకరి పొట్ట కోసిన డాక్టర్: కేకలు వేసిన బాధితురాలు
కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ ను మరొకరికి శస్త్రచికిత్స చేయబోయారు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ విషయమై సూపరింటెండ్ కు బాధితురాలి భర్త ఫిర్యాదు చేశాడు.
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ ను మరొకరికి శస్త్రచికిత్స చేయబోయారు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ విషయమై సూపరింటెండ్ కు బాధితురాలి భర్త ఫిర్యాదు చేశాడు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ కు చెందిన మాలతి, సరోత్తం రెడ్డి దపంతులు. మాలతి ఏడు మాసాల గర్భవతి. ఇటీవల ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. కడుపునొప్పి రావడంతో చికిత్స కోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి ఆమె వచ్చింది. గర్భంలో ఇద్దరు శిశువులున్నారని, ఒక శిశువు బతికే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఒక శిశువును కాపాడేందుకు గర్బసంచికి కుట్లు వేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో సోమవారం నాడు ఆపరేషన్ థియేటర్ కు ఆమెను తీసుకెళ్లారు.
మాలతికి ఆపరేషన్ థియేటర్ అనస్థీయా ఇచ్చారు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మాలతి కేసు షీట్ కు బదులుగా మరొకరి కేసు షీట్ చదివి పొట్ట కోశారు. అయితే అప్పటికే పూర్తిగా మత్తులోకి జారుకోని మాలతి కేకలు వేసింది. గర్బసంచికి కుట్లు వేయాలని కోరింది. దీంతో విధుల్లో ఉన్న డాక్టర్ ఇతర డాక్టర్లతో సంప్రదింపులు చేసి మాలతి పొట్టకు కుట్లు వేసింది. ఆ తర్వాత ఆమెను వేరే గదిలోకి తరలించారు.
ఈ విషయం తెలిసిన మాలతి భర్త సరోత్తం రెడ్డి ఆసుపత్రి సూపరింటెండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని సూపరింటెండ్ తెలిపారు. మాలతి అప్రమత్తంగా లేకపోతే ఏం జరిగేదని ఆమె కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.