Asianet News TeluguAsianet News Telugu

ప్రజల కోసం జైలుకు వెళ్తున్నావా?.. అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది: కవిత వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. 

dk aruna strong counter to kalvakuntla kavitha
Author
First Published Dec 1, 2022, 4:18 PM IST

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత పేరును ప్రస్తావించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామాలపై స్పందించిన కవిత.. కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కవిత వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల సానుభూతి కోసమే కల్వకుంట్ల కుటుంబ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. చేసిన తప్పులు బయటపడతాయనే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పు చేయకపోతే ఈడీ, సీబీఐ దాడులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళితే అది ఆమె చేసిన అవినీతి వల్లేనని అన్నారు. అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లేందుకు సిద్దమన్నట్టుగా కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరును ప్రస్తావించడంపై కవిత స్పందించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ.. దాన్ని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. 

దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్‌లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడితే.. ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐ‌లను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios