హైదరాబాద్: వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి వచ్చేవి పది సీట్లు మాత్రమేనని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకురాలు డికె అరుణ జోస్యం చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆమె అన్నారు. 

టీపీసీసీ చీప్ ఉత్తమ్, జైపాల్ రెడ్డి, డీకే అరుణ, ఇతర ముఖ్య నేతల సమక్షంలో జడ్చర్లకు చెందిన పారిశ్రామికవేత్త అనిరుద్ రెడ్డి బుధవారంనాడు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ అరుణ మాట్లాడారు. 

యువత రాజకీయాల్లోకి రావాలన్న రాహుల్ గాంధీ పిలుపుతో అనిరుద్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని అరుణ చెప్పారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్ పుట్టి ముంచడం ఖాయమని అన్నారు. కేసీఆర్ చెబుతున్నట్లు టీఆర్ఎస్‌కు 100 సీట్లు రాబోవని, వచ్చేది పది స్థానాలే అని ఆమె అన్నారు. 

రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నారని అన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడం కేసీఆర్ తరం కాదని ఆమె అన్నారు.