మునుగోడు ఉప ఎన్నికకు సిద్దమవుతున్న టీఆర్ఎస్‌‌లో అసమ్మతి రాగం చల్లారడం లేదు. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకముందే అసమ్మతి  తారాస్థాయికి చేరుకుంది. 

మునుగోడు ఉప ఎన్నికకు సిద్దమవుతున్న టీఆర్ఎస్‌‌లో అసమ్మతి రాగం చల్లారడం లేదు. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకముందే అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఖాయమైనట్టుగా వార్తల నేపథ్యంలో.. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు అసమ్మతి వినిపిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇటీవల నియోజకవర్గంలో కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలతో జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వారిని ప్రగతి భవన్‌‌కు తీసుకెళ్లారు. అయితే ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చిన నేతలు.. ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. దీంతో పరిస్థితి చక్కబడిందని అంతా భావించారు.

అయితే రెండు రోజులకే సీన్ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభాకర్‌ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సమావేశమైన అసమ్మతి నేతలు.. ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించవద్దని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం కూడా చేశారు. ప్రభాకర్ రెడ్డికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అతనికి తప్ప మిగిలిన ఎవరికైనా టికెట్ ఇచ్చిన గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి స్థానిక నేతలకు అందుబాటులో ఉండటం లేదని వారు ఆరోపించారు. ఈ పరిస్థితులు పార్టీ అదిష్టానానికి తలనొప్పిగా మారాయి. 

ఇదిలా ఉంటే.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 20న జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా మునుగోడులో టీఆర్‌ఎస్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ బహిరంగ సభకు కనీసం లక్ష మంది వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో మునుగోడు, నల్గొండ టీఆర్‌ఎస్ నేతలు.. కేసీఆర్‌ను కలిసి బహిరంగ సభలో ప్రసంగించాలని కోరారు. ఈ సందర్భంగా మునుగోడులో అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌ అఖండ మెజారిటీతో గెలుస్తుందని చెబుతున్నాయని కేసీఆర్ వారితో చెప్పినట్టుగా సమాచారం. 

ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాకు, మునుగోడు నియోజకవర్గానికి సీఎం కొత్త పథకాలు, పథకాలు ప్రకటిస్తారని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జగదీష్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు శుక్రవారం మునుగోడు పట్టణం, నారాయణపూర్‌ సమీపంలోని ప్రతిపాదిత బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేస్తారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి తెలిపారు.