షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దిశను.. నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడి.... అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కాగా... ఆ ఎన్ కౌంటర్ ఎన్ హెచ్ఆర్సీ పోలీసులను విచారిస్తోంది. ఎన్ కౌంటర్ ని వ్యతిరేకించి... అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే... దిశ హత్యోదంతం... ఆమె కుటుంబాన్ని బాగా కుంగదీసింది. ఆ ఘటన నుంచి వాళ్లు ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దిశ తండ్రి రాజేంద్ర నగర్ కి బదిలీ చేసుకున్నారు.  1981-87 మధ్యకాలంలో భారత సైన్యంలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గుమస్తాగా చేరారు.

క్రమంగా సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి ఎదిగిన అతను.. వారంలో ఐదు రోజులు పనిచేసే ప్రదేశంలో ఉంటూ.. శని, ఆదివారాల్లో శంషాబాద్‌లోని తన ఇంటికి వచ్చేవారు.తాను రోజూ శంషాబాద్‌ నుంచి విధులకు వెళ్లి, వచ్చి ఉంటే.. దిశ ఉదంతం జరిగేదికాదని ఆయన పలుమార్లు ప్రస్తావించారు.

దీన్ని దృష్టిలోపెట్టుకుఇ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి.. దిశ తండ్రి బదిలీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయనను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏటీసీలో పనిచేస్తున్న దిశ సోదరికి పగటి షిఫ్ట్‌లో విధులు అప్పగించాలని, నైట్‌షిఫ్ట్‌ వద్దని అధికారులను కోరనున్నట్లు దిశ తండ్రి తెలిపారు. కాగా.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని క్లూస్‌టీం అధికారులు సోమవారం పరిశీలించారు.