కొత్త విద్యాసంవత్సరంలోపు నియామకాలు కష్టమే నోటిఫికేషన్‌ రద్దుతో ప్రత్యామ్నాయాలపై చూస్తోన్న సర్కార్ తాత్కాలిక పద్ధతిలో భర్తీకి సన్నాహాలు !
లక్షల మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తోన్న గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ ఎటూ కదలడం లేదు. సవాలక్ష షరతులు పెట్టి గతంలో గురుకుల పోస్టుల భర్తీకి టీఎస్ పీయస్సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే దానిపై అభ్యర్థుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో టీఎస్ పీయస్సీ... గురుకుల నోటిఫికేషన్ ను రద్దు చేసి సడలించిన నిబంధనలతో మళ్లీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించింది.
వారంరోజుల్లో వస్తుందని భావించిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు దిక్కులేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అయితే మరో రెండు నెలల్లో కొత్త విద్యాసంవత్సరం మొదలుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టింది.
గురుకుల పోస్టుల భర్తీ ని సత్వరమే పూర్తి చేయడానికి బదులు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకులాలకు తొలి ఏడాదే ఉపాధ్యాయుల లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.అందుకే తాత్కాలికంగా గురుకుల ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిస్తోంది.
అయితే దీనిపై గురుకుల పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్టు, పార్ట్ టైం సిబ్బందిని ఇకపై నియమించమని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాటతప్పుతోందని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
