కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణా ఎఐసిసి ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణా ప్రభుత్వం మీద తీవ్రమయిన ఆరోపణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణా ఎఐసిసి ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణా ప్రభుత్వం మీద తీవ్రమయిన ఆరోపణ చేశారు.
తెలంగాణా పోలీసులు, ముఖ్యమంత్రి కెసిఆర్ కనుసన్నల్లో ఒక బోగస్ ఐసిస్ వెబ్ సైట్ నడుపుతున్నారని ఆయన అన్నారు.
‘తెలంగాణ పోలీసులు బోగస్ ఐసిస్ వెబ్‌సైట్ తయారుచేసి ఆవేశాన్ని రెచ్చగొట్టే పోస్టులతో యువతనుతీవ్రవాదులుగా మారేలా వుసిగొలుపుతున్నారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారా? అదే నిజమయితే, కేసీఆర్ దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని దిగ్విజయ్ సింగ్ కొద్ది సేపటి కిందట ట్విట్టర్ ఖాతా (@digvijaya_28)లో పోస్టు చేశారు.
‘ఇది కెసిఆర్ కు నైతికంగా తగునా? ముస్లిం యువకులను ట్రాప్ చేసి వాళ్లు ఐసిస్ లోచేరేలా ప్రోత్సహించాలని పోలీసులకు ఆయన అనుమతిచ్చారా?’
(Is It Ethical ? Is it Moral ? Has KCR authorised Telangana Police to trap Muslim Youths and encourage them to join ISIS ?)
‘తెలంగాణా పోలీసులు బోగస్ ఐసిస్ వైబ్ సైట్ ను ప్రారంభించారు ముస్లిం యువకులు ఐసిసి మాడ్యూల్స్ లో చేరేలా చేస్తున్నారు.’
దీనిని తెలంగాణా ఐటి మంత్రి కెటిఆర్ అంతే తీవ్రంగా ఖండించారు. ‘ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలురావడం చాలా బాధ్యతారాహిత్యం. దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరుతున్నా. ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలి,’ అని కెటిఆర్ అన్నారు.
