Asianet News TeluguAsianet News Telugu

లిఫ్ట్ అడిగి ప్రాణం తీశాడు.. పథకం ప్రకారమే హత్యా!?.. పిచ్చికుక్కలను చంపేందుకు వాడే విషంతో ఇంజక్షన్..!!

లిప్ట్ ఇస్తే ప్రాణం తీసిన ఘటనలో తెలుస్తున్న విషయాలు షాక్ కు గురి చేస్తున్నాయి. అతడిని కావాలనే పథకం ప్రకారమే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

details in Stranger kills biker after giving lift in Khammam case, Telangana
Author
First Published Sep 20, 2022, 6:54 AM IST

ఖమ్మం : లిఫ్ట్ ఇచ్చిన పాపానికి విషం ఇంజక్షన్ గుచ్చి చంపిన ఘటన ఖమ్మంలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో కావాలనే.. పథకంప్రకారమే అతడిని హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఇది ఎందుకు జరిగింది.. సైకో పనా? లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో లిఫ్టు అడిగి బండెక్కిన వ్యక్తి.. వెనక నుంచి ఇంజక్షన్ గుచ్చి.. సాయం చేసిన వ్యక్తిని చంపేశాడు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో సోమవారం జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…  ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (48) తన పెద్ద కుమార్తె ను ఏపీలోని జగ్గయ్యపేట మండలం చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు.  

జమాల్ సాహెబ్  భార్య ఇమాంబీ.. మూడు రోజులుగా కుమార్తె వద్ద ఉంటుంది. ఆమెను తీసుకు వచ్చేందుకు ఆయన సోమవారం ఉదయం బొప్పారం నుంచి టూవీలర్ పై బయలుదేరారు. ఆయన బండి ముదిగొండ మండలం వల్లభి సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి లిఫ్టు అడిగారు. తమ బండిలో పెట్రోల్ అయిపోయిందని, ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోల్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో ఆయన అంగీకరించి బండిపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక వెనక కూర్చున్న వ్యక్తి జమాల్ సాహెబ్  వీపుమీద ఇంజెక్షన్తో పొడిచాడు. ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడం, కళ్ళు బైర్లు కమ్మడంతో ఆయన  బండిని స్లో చేశాడు.

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి బైకర్‌పై ఇంజెక్షన్‌తో దాడి..

వెనక కూర్చున్న వ్యక్తిని ఏం చేసావు అని అడుగుతుండగానే.. బండి మీద నుంచి దూకేశాడు. వెనకాలే వస్తున్న మరో నిందితుడి బండెక్కి పారిపోయాడు. జమాల్ సాహెబ్ అలాగే కొంత దూరం ముందుకు వెళ్లాడు. అక్కడ తన వాహనాన్ని ఆపి మంచినీరు ఇవ్వాలని రోడ్డు పక్కన ఉన్నవారిని అడిగాడు. నీళ్లు తాగి తన భార్యకు ఫోన్ కలపాలని  అడిగాడు. ఫోన్ కలవకపోవడంతో..  బండిపైన లిఫ్టు అడిగిన వ్యక్తి ఏదో గుచ్చి పారిపోయాడని, కొన్ని వివరాలు చెప్పి పడిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా మార్గమధ్యంలోనే జమాల్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అక్కడే పడి ఉన్న సిరంజీని గుర్తించారు. మృతుని అల్లుడు లాల్ సాహెబ్ ఫిర్యాదు మేరకు ఖమ్మం గ్రామీణ సీఐ శ్రీనివాస్  కేసు నమోదు చేశారు.

పథకం ప్రకారమే..
జమాల్ సాహెబ్ కన్నా ముందు వెళ్లిన మైసయ్య అనే వ్యక్తిని కూడా నిందితులు లిఫ్ట్ అడిగారు. అయితే, అతను బండి ఆపినా  ఎక్కకుండా పంపించేశారు. తరువాత వచ్చిన జమాల్ సాహెబ్ బండిని ఆపి దారుణానికి పాల్పడ్డారు. దీన్నిబట్టి నిందితులు  పథకం ప్రకారం హత్య చేసినట్లు భావిస్తున్నారు. కారణాలు మాత్రం తెలియరావడం లేదు. ఎవరైనా సైకోలు చేసిన పనా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చంపడానికి పిచ్చికుక్కలను చంపేందుకు వాడే రసాయనం ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ఘటనతో ముదిగొండ నేలకొండపల్లి మండలం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో ఉన్నారు.  లైట్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని ఇంజెక్షన్ చేసే వ్యక్తి తిరుగుతున్నాడు జాగ్రత్త అంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios