హైదరాబాద్‌లో దీపావళి తర్వాత రోజు సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నగరంలోని యాదవులు తమ దున్న పోతులను ముస్తాబు చేసి ఘనంగా ఉరేగిస్తుంటారు. ఇలాగే నిన్న(గురువారం) ముషీరాబాద్ ప్రాంతంలోని గోల్కొండ చౌరస్తాలో సదర్ ఉత్సవాలు జరిగాయి. అయితే ఈ ఉత్సవాల్లో స్వల్ఫ అపశృతి చోటుచేసుకుంది. దీంతో ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటి సీఎం మహమూద్ అలీ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సదర్ ఉత్సవాల కోసం ఇతర ప్రాంతాల నుండి భారీ దున్నపోతులతో ముషీరాబాద్ ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో షహన్‌షా, ధారా అనే దున్నపోతులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

అయితే ఈ సదర్ ఉత్సవాలకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారీ దున్నపోతులను పరిశీలించి, వాటి ప్రదర్శనను తిలకించారు. అయితే ఆయన అక్కడే వుండగా ఉన్నట్టుండి ఈ షహన్‌షా, ధారా దున్నపోతులు కొట్లాటకు దిగాయి. కొమ్ములతో ఒకదానితో ఒకటి పొడుచుకోడానికి ప్రయత్నించాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై  డిప్యూటీ సీఎంను అక్కడి నుండి సురక్షితంగా బైటకు తీసుకువచ్చారు.

వీటిని అదుపులోకి తేవడానికి నిర్వహకులు ప్రయత్నించగా రెండు దుననపోతులు రోడ్డుపై పరుగు తీశాయి. ఇలా పరుగెత్తుతూ రోడ్డు పక్కన నిలిపిన డిప్యూటీ సీఎం కాన్వాయ్ లోని ఓ కారును డీకొట్టాయి. దీంతో కారు సైడ్ లైట్స్ పగిలిపోయి స్వల్పంగా దెబ్బతింది. 

చివరకు ఎలాగోలా  నిర్వహకులు వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో నిర్వహకులతో పాటు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.