Asianet News TeluguAsianet News Telugu

ప్రజారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

deputations cancelled in public health department in telangana ksp
Author
Hyderabad, First Published Jul 6, 2021, 8:10 PM IST

వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నియమితులైన స్థానాల్లో కాకుండా డిప్యుటేషన్లు, వర్క్‌ ఆర్డర్లపై వేర్వేరు చోట్ల పనిచేస్తున్న వారందరూ తక్షణమే తమ నియమిత స్థానాల్లో చేరాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.

అన్ని స్థాయుల డిప్యుటేషన్లు, వర్క్‌ ఆర్డర్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో డిప్యుటేషన్లు, వర్క్‌ ఆర్డర్ల పేరిట 1000 మందికి పైగా ఉద్యోగులు వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లు అంచనా. వారిలో చాలామంది పైరవీలు చేయించుకొని, ముడుపులు ముట్టజెప్పి తమకు అనుకూల ప్రదేశాల్లో పనిచేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వారు పనిచేయాల్సిన ప్రదేశాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. 

గ్రామీణ స్థాయి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సరిగా ఉండక పోగా... ఉన్నవారిని డిప్యూటేషన్ల మీద ఇతర ప్రాంతాలకు పంపించేవారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా స్పందించింది. డిప్యూటేషన్ విధానానికి స్వస్తి పలికింది. డిప్యుటేషన్ల వల్ల నష్టాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, వైద్య విద్య సంచాలకుల పరిధిలోని డిప్యుటేషన్లపై చర్యలు తీసుకుంటే మేలు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

Follow Us:
Download App:
  • android
  • ios