Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మళ్లీ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తోంది. 

Delhi liquor scam : YCP MP Magunta Srinivasulu Reddy's house searched
Author
First Published Sep 16, 2022, 2:09 PM IST

హైదరాబాద్ :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, చెన్నై, ఏపీలోని నెల్లూరులో  తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోథీ రోడ్డులో ఉన్న 95 వ నెంబర్ బంగ్లాలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.

లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. గతంలో కోకాపేట్ లోని రామచంద్ర పిల్లై నివాసం, నానక్ రామ్ గూడలోని  రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  రాబిన్ డిస్టిలరీస్, రాబిన్  డిస్ట్రిబ్యూషన్ ఎల్.ఎల్.పి. పేరుతో  రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో  మరోసారి హైదరాబాద్ లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అయితే ఈ సోదాలపై ఈడీ  ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.

లోన్ యాప్ సంస్థలపై ఈడీ సోదాలు: దేశంలో16 చోట్ల కొనసాగుతున్న తనిఖీలు

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 6న ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంగా  దేశవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ, లక్నో, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్ లో ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలతో పాటు అతని నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో రాబిన్ డిస్టిలరీ పేరుతో ఆయన వ్యాపారం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ ఇప్పటికే 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం రాజకీయంగా ఆప్,  బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమయింది. ఈ స్కామ్ లో  తెలంగాణా లోని కొందరికి సంబంధం ఉందని బిజెపి ఆరోపణలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది జూలై మాసంలో ఈ పాలసీ సర్కారు రద్దు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మీద సిబిఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఆర్య గోపి కృష్ణ, రామ చంద్రన్ పిళ్లై వంటి వారి పేర్లను సిబిఐ ఇందులో చేర్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios