ఢిల్లీ లిక్కర్ స్కామ్: మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. ఉత్కంఠగా పరిణామాలు..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణకు బయలుదేరే ముందు.. కవిత తన వద్ద ఉన్న ఫోన్లను మీడియాకు చూపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణకు బయలుదేరే ముందు.. కవిత తన వద్ద ఉన్న ఫోన్లను మీడియాకు చూపించారు. దీంతో కవిత మూడో రోజు విచారణలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. వివరాలు.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరిన సమయంలో.. కవిత తన కారులో నుంచి బయటకు వచ్చి కవర్‌లలో ప్యాక్ చేసి ఉన్న తన ఫోన్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఈడీ కార్యాలయం వద్ద కూడా కవిత మరోసారి తన ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు మరోసారి విచారించనున్నారు. తొలుత ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. సోమవారం దాదాపు 10 గంటలకు పైగా ఆమెను విచారించారు. నిన్న రాత్రి 9 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు విచారించనుండటంతో.. ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈరోజు విచారణలో కవిత ఫోన్ డేటాపై ఈడీ అధికారులు దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కవిత తన వద్ద ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఎలాంటి ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈడీ ముందు సమర్పించనున్న మొబైల్ ఫోన్లను కవిత మీడియా ముందు ప్రదర్శించారు.