సీనియర్లకు నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ డిగ్రీ స్టూడెంట్ ను కిడ్నాప్ చేసి, దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండల కేంద్రంలో కలకలం రేపింది. మహేష్ కుమార్ సింగ్ అనే యువకుడు శంషాబాద్ లోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నాడు. గురువారం తన స్నేహితులతో కలిసి శంషాబాద్‌ మండలంలోని నానాజీపూర్‌ వాటర్‌ఫాల్స్‌ కు విహారయాత్రకు వెళ్లాడు. 

అప్పటికే అక్కడ కొత్తూరుకు చెందిన పల్లెల చందు, కొల్లంపల్లి మురారి, ముడావత్‌ వినోద్, శ్రీకాంత్‌ లు ఉన్నారు. అయితే తమ ఊరికే చెందిన మహేష్ కుమార్ తమను చూసి కూడా నమస్తే పెట్టలేదని కోపంతో గొడవకు దిగారు. 

ఆ తరువాత మహేష్ కుమార్ అక్కడినుండి బయలుదేరిన మహేష్ తన బైకు మీద కొత్తూరుకు వస్తున్నాడు. వాటర్ ఫాల్స్ దగ్గర గొడవకు దిగిన యువకులు మహేష్ ను వెంబడించి బైక్ ను ఆపారు. మహేష్ ను తమ బైక్ మీద ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. 

సుమారు రెండు గంటల పాటు మండలకేంద్రంలోని ఆయా వెంచర్లలో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌కుమార్‌ వారి నుంచి ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీఐ భూపాల్‌ శ్రీధర్‌ తెలిపారు.