తన ప్రాణ స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నారాయణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ కి చెందిన శ్రీదేవి(22) హిమాయత్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ.. రిషి డిగ్రీ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నమ్రత కూడా ఇదే హాస్టల్ లో ఉంటూ...అదే కాలేజీలో చదువుతోంది. దీంతో.. వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది.

అన్ని విషయాలు ఒకరికొకరు చర్చించుకునే వారు. ఈ క్రమంలో ఏమైందో ఇద్దరి మధ్యా మనస్పర్దలు వచ్చాయి. మూడు వారాల క్రితం నమ్రత తన స్వస్థలానికి వెళ్లింది. శ్రీదేవి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా నమ్రత స్పందించలేదు. శనివారం పరీక్ష రాసేందుకు నమ్రత నగరానికి వచ్చింది. 

పరీక్ష రాసిన అనంతరం నమ్రతను శ్రీదేవి హాస్టల్‌కు తీసికెళ్లింది. గదికి గడియ పెట్టి ‘ఇకపై నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు. నేను చెప్పినట్లు వినాలి. నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను..మనిద్దరం కలిసి ఉందాం’ అంటూ చెప్పడంతో నమ్రత ఒప్పుకోలేదు. అయినా శ్రీదేవి వినకపోవడంతో అదేరోజు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు శ్రీదేవి కి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. తరువాత హాస్టల్‌కు వెళ్లిన శ్రీదేవిఎవరూ లేని సమయంలో ‘సూపర్‌ వాస్మోల్‌’ కొబ్బరి నూనె తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.