హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు ఉచ్చు బిగుస్తోంది. సదరు యువతిపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి... మరింత కిరాతకంగా హత్య చేశారు. కాగా నలుగురు నిందితులపై 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్ డబ్ల్యూ 34, 392 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన సాక్ష్యాధారాల్ని పకడ్బందీగా సేకరించే పనిలో సైబరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో పోలీసులు వీలైనంత తొందరగా అభియోగపత్రం రూపొందించేందుకు సిద్ధమౌతున్నారు. ఘటనాస్థలిలో భాధితురాలికి సంబంధించిన వస్తువులు, హత్య అనంతరం ఆమెను కాల్చేందుకు నిందితులు పెట్రోల్ బంక్ లో పెట్రోలు కొనుగోలు వరకు పక్కాగా ఆధారాలు సిద్ధం చేస్తున్నారు.

ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిన వెంటనే అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. వరంగల్ జిల్లాలో గత జూన్ లో 9నెలల చిన్నారిని అహరించి అత్యాచారం చేసిన కేసులో లాగానే వీలైనంత తొందరగా తీర్పు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నేరం రుజువు అయితే.. నలుగురికి మరణ శిక్ష విధించే అవకాశం ఉందని సంబంధిత అధికారలు చెబుతున్నారు. 

కాగా... ఈ కేసులో లారీ యజమాని సాక్ష్యం కీలకం కానుంది. హత్య జరిగిన రోజు ఉదయం 9గంటల నుంచి రాత్రి వరకు నిందితులు లారీలోనే తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.అక్కడి పరిసరాల్లో నిందితుల కదలికలపై సీసీ ఫుటేజీని సేకరించారు. నిందితులు ఆ రోజంతా అక్కడే ఉన్నట్లు లారీ యజమాని ఇచ్చే వాంగ్మూలం కేసులో కీలకంగా నమోదు చేయించాలని పోలీసులు నిర్ణయించారు.