విశాఖ జిల్లా అరకు సమీపంలోని అరకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు ఆదివారం నాడు మధ్యాహ్నం హైద్రాబాద్ షేక్‌పేటకు చేరుకొన్నాయి. 

హైదరాబాద్: విశాఖ జిల్లా అరకు సమీపంలోని అరకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు ఆదివారం నాడు మధ్యాహ్నం హైద్రాబాద్ షేక్‌పేటకు చేరుకొన్నాయి.

అరకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన సత్యనారాయణ, సరిత, లత, చిన్నారి శ్రీనిత్యలు మరణించారు. మృతదేహాలతో పాటు క్షతగాత్రులను ప్రత్యేక అంబులెన్స్ లలో తరలించారు.

ఎనిమిది మంది విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. అనుభవం ఉన్న డ్రైవర్ ను పంపాలని తాము కోరినా కూడ యాజమాన్యం పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విశాఖ ఆసుపత్రిలో తమకు సరిగా వైద్య సదుపాయం అందలేదని కొందరు బాధితులు ఆరోపించారు. విశాఖలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.