కొత్త సచివాలయం నిర్మాణానికి భూమిపూజ ఖరారు సెంటిమెంట్ ఆధారంగా కేసిఆర్ నిర్ణయం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ
తెలంగాణ సిఎం పట్టు పడితే వెనకడుగు వేయరు. ఆయన మనసులో అనుకుంటే మాత్రం ఆ పని చేసి తీరుతారు. ఎన్ని అవాంతరాలెదురైనా తలపెట్టిన కార్యం ఆపరు. ఇవి నేను చెప్పే మాటలు కాదు.. పార్టీ నేతలు, కార్యకర్తలు తరచుగా చెబుతున్న మాటలు.
తాజాగా సకల సౌకర్యాలతో తెలంగాణ సచివాలయం నిర్మించేందుకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచే కేసిఆర్ తలంచారు. దీంతో ఆయన అనుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న సచివాలయం పనికిరానిదని చెప్పడానికి పార్టీ నేతలు తీవ్రంగానే శ్రమించారు. వాస్తుదోషం అని కొందరంటే ఫైర్ సేఫ్టీ లేదని ఇంకొందరు వాదించారు. క్యాంటీన్ బాగాలేదని మరికొందరు అంటున్నారు. పార్కింగ్ దిక్కులేదని కొందరు చెబుతున్నారు. రవాణా సౌకర్యాలు లేవని ఇంకొందరి మాట.
ఈ నేపథ్యంలో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు కేసిఆర్ సర్కార్ సంకల్పించింది. మరో మూడు వారాల్లోనే కొత్త సచివాలయ భూమిపూజకు కేసిఆర్ ముహూర్తం ఖరారు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయదశమి నాడే సికింద్రాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు ముహూర్తం కూడా కేసిఆర్ ఫిక్స్ చేశారని పార్టీ నేతల ద్వారా తెలిసింది. విజయదశమి సెంటిమెంట్ ను కేసిఆర్ బాగా విశ్వసిస్తారని పార్టీ నేతలు అంటుంటారు.
గత దసరా నాడే కీలకమైన కార్యక్రమాలు చేపట్టారు కేసిఆర్. ఐడిహెచ్ కాలనీలోని డబుల్ బెడ్రూముల ఇళ్ల పంపిణీ దసరా నాడే షురూ చేశారు. దాంతోపాటు కొత్త జిల్లాలను సైతం దసరా నాడే మనుగడలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా నాడే కొత్త సచివాలయానికి ముహూర్తం ఖరారైపోయిందని పార్టీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
మరి గతంలో దసరా రోజే ప్రారంభించినా డబుల్ బెడ్రూముల ఇండ్ల పథకం ఆశించినంతగా జరుగుతలేదన్న ప్రచారం ఉంది. అలాగే కొత్త జిల్లాల పాలన సైతం ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో మరి దసరా సెంటిమెంట్ ఎలా పనిచేస్తుందోనన్న చర్చలు కూడా సాగుతున్నయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
