Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ కు దాసోజు శ్రవణ్ కొత్త సవాల్

  • దొంగ‌లు దొంగ‌లు క‌లిసి సింగ‌రేణిని పంచుకుంటున్నారు
  • అక్ర‌మాల‌కు అడ్డాగా సింగ‌రేణి యాజమాన్యం మారింది
  • యాజ‌మాన్యం, టిఆర్ ఎస్‌, బొగ్గు ఘ‌నిక కార్మిక సంఘం అక్ర‌మాలు 
  • సెంట్ర‌ల్ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశాం
  • ద‌మ్ముంటే విచార‌ణకు సిద్దం కండి
  • సింగ‌రేణి హామీలు నెరవేర్చ‌క‌పోతే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటారా ?
dasoju sravan new challenge for trs party

సింగ‌రేణి అక్ర‌మాల‌కు అడ్డ‌గా మారింది, అక్క‌డ లేని బొగ్గుకు ఉన్న‌ట్టుగా చూపిస్తున్నారా ?  లేక వేల ట‌న్నుల బొగ్గుకు అక్ర‌మంగా అమ్మ‌కుంటున్నారా అన్న‌ది తేలాల్సి ఉంది, సింగ‌రేణి ఎన్నిక‌ల‌లో గెల‌వ‌డానికి తెలంగాణ బొగ్గు ఘ‌ని కార్మిక సంఘం అనేక అక్ర‌మాలు చేస్తుంది, అందుకు యాజామాన్యం సహ‌క‌రిస్తుంద‌ని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ శ్ర‌వ‌న్ దాసోజు విమ‌ర్శించారు. బుధ‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ సింగ‌రేణిలో అక్ర‌మాల‌పై సుదీర్ఘంగా సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మీష‌న‌ర్ కె.వి చౌద‌రికి ఫిర్యాదు చేసిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దొంగ‌లు దొంగ‌లు క‌లిసి ఊళ్ళు పంచుకున్న‌ట్టు, సింగ‌రేణి యాజ‌మాన్యం, టిఆర్ ఎస్ నాయ‌కులు, బొగ్గు ఘ‌ని కార్మిక సంఘం నాయ‌కులు కలిసి సింగ‌రేణిలో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. 

సింగ‌రేణి ప‌రిధిలోని 11 డివిజ‌న్‌ల‌లో 74 ల‌క్ష‌ల 54 వేల 622 మెట్రిక్ ట‌న్నుల బొగ్గును త‌వ్వి, నిలువ  చేసిన‌ట్టు సింగ‌రేణి యాజ‌మాన్యం లెక్క‌లు చూపిస్తుందిని అయితే ఒక్క మెట్రిక్ ట‌న్ను బొగ్గు త‌వ్వాలంటే ప‌ది నుంచి ప‌న్నెండు ట‌న్నుల మ‌ట్టి త‌వ్వాల్సి వ‌స్తుంద‌ని అలాగే ఒక్క ట‌న్ను బొగ్గు ధ‌ర మార్కెట్ ధ‌ర 2 వేల రూపాయ‌లుంద‌ని అంటే దాని విలువ సుమారు 1490 కోట్ల రూపాయ‌లుంటుంద‌ని, ఇంత పెద్ద ఎత్తున బొగ్గు త‌వ్వి నిల‌వ చేయాలంటే అంత పెద్ద మొత్తంలో మ‌ట్టి నిలువ‌లు కూడా ఉండాలి క‌దా, మ‌రి అదంతా ఎక్క‌డ పోయింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.  అదే విధంగా ఆ మ‌ట్టి తీయ‌డానికి అవ‌స‌ర‌మైన ఖ‌ర్చు లెక్క‌లు చూపాల‌ని కానీ యాజ‌మాన్యం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున జ‌రిగిన త‌వ్వ‌కాల గురించి లెక్క‌లు చూప‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణిలో జ‌రిపిన‌ క్షేత్ర స్తాయి ప‌రిశీల‌న‌లో ఐదు నుంచి ప‌ది శాతం కూడా బొగ్గు నిలువ‌లు లేవ‌నే వాస్త‌వం తేలింద‌ని, మ‌రి ఈ బొగ్గు అంతా ఎక్క‌డ పోయింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు ఈ బొగ్గు ఉన్న‌దా లేక దొంగ త‌నంగా అమ్ముకున్నారా, లేని బొగ్గును ఉన్న‌ట్టు దొంగ లెక్క‌లు రాశారా అన్న విష‌యాలు తేలాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఈ బొగ్గు  ఉంద‌ని  లెక్క‌ల్లో చూపిస్తూ దాని ఆధారంగా లాభాల‌ను లెక్క క‌డుతూ,  కేంద్రానికి క‌ట్టాల్సిన  జి.ఎస్‌.టి, ఇన్‌కం టాక్స్, త‌దిత‌ర ప‌న్ను క‌డుతున్నార‌ని ఒక‌వేళ అదే నిజ‌మైతే మ‌రి బొగ్గు నిలువ‌లు ఎందుకు చూపించ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మొత్తంమీద ఈ వ్య‌వ‌హార‌మంతా స‌త్యం కంప్యూట‌ర్స్ కుంభ‌కోణం త‌ల‌పిస్తుంద‌ని, వేల కోట్ల రూపాయ‌ల బొగ్గు అక్ర‌మంగా ర‌వాణ జరిగిందా లేక గొప్ప‌ల కోసం ముఖ్య మంత్రి మెప్పు కోసం లేని బొగ్గును ఉన్న‌ట్టుగా దొంగ లెక్క‌లు చూపిస్తున్నారా అన్న విష‌యం తేలాల్సిన అవ‌స‌ర‌ముంది. తెలంగాణ‌కు త‌ల‌మానిక‌మైన  సింగ‌రేణిని కాపాడుకోవాలంటే దానిపై ఆధార‌ప‌డ్డ ల‌క్ష‌ల మంది జీవితాల‌ను కాపాడాలంటే సింగ‌రేణిలో జ‌రుగుతున్న ఈ కుంభ‌కోణాల‌పై స‌మ‌గ్ర ఉన్న‌త స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సివిసితోపాటు కేంద్ర బొగ్గు ఘ‌నులు శాఖ మంత్రి ఫియూష్ గోయ‌ల్ కు, సిబిఐ డైరెక్ట‌ర్కు, ఎసిబికి, రాష్ట్ర ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శికి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. 

51 శాతం వాటా దారులైన తెలంగాణ ప్ర‌భుత్వం సింగ‌రేణిలో ఇన్ని కుంభ‌కోణాలు, అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నా, ఎంద‌కు స్పందించ‌డం లేద‌ని, అందులో తెలంగాణ ప్ర‌భుత్వం కుట్ర కూడా ఉంద‌న్న అనుమానాలున్నాయ‌ని ఆయ‌న అన్నారు. టిఆర్ ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గు ఘ‌ని కార్మిక సంఘం కూడా ఈ బొగ్గు అవ‌క‌త‌వ‌క‌ల ప‌ట్ల నోరు ఎందుకు విప్ప‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వీట‌న్నింటిని చూస్తే ఎం.డి శ్రీ‌ద‌ర్ నేతృత్వంలో ప‌నిచేస్తున్న సింగ‌రేణి యాజ‌మాన్యం, టిఆర్ ఎస్ అనుబంధ సంస్థ , ప్ర‌భుత్వం కుమ్మ‌క్కైన‌ట్లు అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. 

ఇలా సింగ‌రేణిని అతి పెద్ద అక్ర‌మాల‌కు అడ్డ‌గా, అవినీతికి, కుంభ‌కోణాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మార్చేసి దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సింగ‌రేణి ప‌ర‌వు తీస్తు, ప్ర‌మాదంలోకి నెట్టేస్తున్న తెలంగాణ బొగ్గు ఘ‌ని కార్మిక సంఘానికి ఓటు వేస్తారా అని ప్ర‌శ్నించారు. అదే విధంగా సింగ‌రేణి యాజ‌మాన్యం, ముఖ్యంగా మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌ద‌ర్ దిగ‌జారిపోయి బొగ్గు ఘ‌ని కార్మిక సంఘం గెలిచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కింది స్థాయి అధికారుల‌కు మౌఖిక ఆదేశాలు ఇవ్వ‌డం స‌హించ‌లేని నేరంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

మిష‌న్ భ‌గీర‌థ భాగంగా ప్ర‌తి ఇంటికి మంచినీరు అందిస్తామ‌ని  ప్ర‌గ‌ల్బాలు ప‌లికి, ఇవ్వ‌క‌పోతే ఓట్లు అడ‌గ‌మ‌ని పోటీ చేయ‌మ‌ని ఢాంబికాలు పలుకుతున్న టిఆర్ ఎస్ పెద్ద‌లు సింగ‌రేణి విష‌యంలో కూడా అదే శ‌ప‌థ‌కం చేస్తారా అని నిల‌దీశారు. సింగ‌రేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని అయితే ఎన్నిక‌లు రాగానే వారిపై మొస‌లి క‌న్నీరు కారుస్తూ లేని ప్రేమ‌లు చూపిస్తూ ఎన్నిక‌ల హామీలు ఇస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

ఒక‌వేళ ఈ ఎన్నిక‌ల‌లో ఎవ‌రు గెలిచినా ప్రభుత్వం సింగ‌రేణి కార్మికుల హామీలు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఉంద‌ని, నెర‌వేర్చ‌ని ప‌క్షంలో సింగ‌రేణి ప‌రిధిలోని ఎం.ఎల్‌.ఎ, ఎం.పి నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేయ‌మ‌ని శ‌ప‌థం చేయ‌గ‌లిగే ద‌మ్ము, ధైర్యం ఉందా అని ఆయ‌న నిల‌దీశారు. సింగ‌రేణి ఎన్నిక‌ల‌లో ఇప్పుడు ప్ర‌చారం చేస్తున్న ఎం.పిలు క‌విత‌, సుమ‌న్‌లో రాబోయే ఎన్నిక‌ల‌లో ఎం.పిలుగా పోటీ చేయ‌ర‌ని, కార్మికుల‌కు అందుబాటులో ఉండకుండా జ‌గిత్యాల‌లో, సుమ‌న్ చొప్ప‌దండిలో ఎం.ఎల్‌.ఎలుగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అందుకే వారు సింగ‌రేణి ప్ర‌చారంలో జోరుగా పాల్గొంటున్నార‌ని ఆయ‌న అన్నారు. 

విచ్చ‌ల‌విడిగా అధికార దుర్వినియోగం, పోలీసుల వినియోగం, డ‌బ్బుల పంపిణీ, నాయ‌కుల ప్ర‌చారం, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న లాంటి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతు ఎలాగైనా గెల‌వాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని, ఓటర్ల‌కు పంచుతున్న సొమ్ము ప్ర‌జ‌ల నుంచి కొల్ల‌గొట్టిందేన‌ని అదంతా మిష‌న్ భ‌గీర‌థ‌, సాగునీటి ప్రాజెక్ట‌ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ ప్ర‌జల‌ సొమ్మునే అని ఈ విష‌యంలో ఓట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఆలోచించి వారికి త‌గిన బుద్ది చెప్పాల‌ని ఆయ‌న కోరారు. 

తెలంగాణ బొగ్గు ఘ‌ని కార్మిక సంఘానికి అస‌లు నాయ‌కులు ఎవ‌ర‌ని, సంఘంలో నాయ‌కులంతా అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంద‌ని, వీళ్ళంతా భ‌విష్య‌త్తులో కార్మికుల సంక్షేమానికి ఎలా కృషి చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అందువ‌ల్ల జాతీయ సంఘాలతోనే కార్మికుల న్యాయ‌మైన డిమాండ్లు ప‌రిష్కారం అయ్యే అవకాశ‌ముంద‌ని గురువారం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌లో తెలంగాణ బొగ్గు ఘ‌ని కార్మిక సంఘాన్ని ఓడించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఉన్న తెలంగాణ బొగ్గు ఘ‌ని కార్మిక సంఘాన్ని ఓడించాల‌ని, సింగ‌రేణిని కాపాడుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/YA2dH3

 

Follow Us:
Download App:
  • android
  • ios