తాండూరు కాంగ్రెస్ సభలో రామ్మోహన్ రెడ్డికి దానం నాగేందర్ షాక్

First Published 27, Feb 2018, 6:25 PM IST
Danam snatches MLA mike to calm down Revanth fans
Highlights
  • తాండూరు సభలో పరిగి ఎమ్మెల్యే చేతిలో మైక్ గుంజుకున్న దానం
  • మైక్ గుంజుకోవడంతో షాక్ కు గురైన రామ్మోహన్ రెడ్డి
  • రేవంత్ అభిమానులు క్రమశిక్షణతో ఉండాలని దానం ఫైర్

కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో సభ జరిగింది. ఈ సభలో జైపాల్ రెడ్డి మాట్లాడారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడతారని సభలో ప్రకటించారు. కానీ రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున గోల చేశారు. రేవంత్ మాట్లాడాలంటూ నినాదాలు పెద్ద పెట్టున చేశారు. రామ్మోహన్ రెడ్డిని మాట్లాడకుండా హడావిడి చేశారు. దీంతో సభలో వేదిక మీద కూర్చున్న దానం నాగేందర్ సీరియస్ గా లేచి వచ్చి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతిలోంచి మైకులు గుంజుకున్నారు. ఆ సమయంలో రామ్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయినా వదలకుండా మైకులు చేతిలోంచి గుంజుకున్న దానం నాగేందర్ మాట్లాడారు.

మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఉందా లేదా? కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా చేయడం సరికాదు.. అంటూ కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మనందరం క్రమశిక్షణతో పనిచేయాలి. ఇలా చేయడం మంచిది కాదు. మనం అధికారంలోకి రావాలంటే క్రమశిక్షణ అవసరం. ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు.. అంటూ ఆగ్రహంగా మాట్లాడారు. దానం మాట్లాడుతున్న సమయంలోనూ రేవంత్ అభిమానులు తమ గోలను కంటిన్యూ చేశారు. అయితే తర్వాత మైక్ తీసుకున్న రామ్మోహన్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడి ప్రసంగం ముగించారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగం మొదలు పెట్టారు. రేవంత్ అభిమానులు శాంతించారు.

loader