Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. వారి వల్లే నష్టపోతున్నాం: దామోదర్ రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో గత 8 ఏళ్లుగా కొత్త రోగం మొదలైందని.. దాని పేరు కోవర్టిజం అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ అన్నారు. అది  చాలా ప్రమాదకరమైన రోగమని చెప్పారు. 

Damodara rajanarsimha says coverts in congress party
Author
First Published Dec 13, 2022, 1:57 PM IST

కాంగ్రెస్‌లో గత 8 ఏళ్లుగా కొత్త రోగం మొదలైందని.. దాని పేరు కోవర్టిజం అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ అన్నారు. అది  చాలా ప్రమాదకరమైన రోగమని చెప్పారు. కోవర్టులు కాంగ్రెస్‌లో ఉంటూ, కాంగ్రెస్ పాట పాడుతూ.. ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలను, ధైర్యం దెబ్బతీస్తే పార్టీకే ప్రమాదమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల కూర్పుపై దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. 

అనంతరం దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. బలహీనవర్గాలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు ఏమిటో తెలియనివారికి పదవులా? అని ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. లోపం ఎక్కడ జరుగుతుందో పార్టీలో చర్చ జరగడం లేదన్నారు. 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉత్సాహంగా పనిచేశారని అన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో భారత్ జోడో యాత్రను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. అయితే పదవుల పంపకానికి వస్తే కష్టపడినవారికి, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులకే గుర్తింపు ఉందని ఆరోపించారు. 

సిద్దిపేట జిల్లాలో కోవర్టిజం ఉందని ఇక్కడి నాయకులు గత నాలుగేళ్లుగా చెబుతున్న పట్టించుకున్న నాథుడే లేకుండా  పోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినవారికి అన్యాయం జరుగుతందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఎవరేం చేశారు?, ఎవరు పదవులు అనుభవిస్తున్నారే దానిపై డేటా తీయాలని.. పార్టీ బలోపేతం అనేది చాలా ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్‌కు సింపతీ ఉందని.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంతా కోరుకుంటున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీల ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయా అనే అనుమానాలు క్యాడర్‌లో ఉందన్నారు. 

సిద్దిపేట జిల్లాలో కోవర్టులకు సీట్లు ఇస్తున్నారని విమర్శించారు. ఎవరి డైరెక్షన్‌ల ఈ పోస్టులు వస్తున్నాయని ప్రశ్నించారు. దీని వెనక  ఎవరి ఇంటస్ట్ర్ ఏమిటనేది  తేలాలని అన్నారు. అసలైన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఏ తప్పు చేసిన కాంగ్రెస్ మనుగడ కష్టమని అన్నారు. కోవర్టులను గుర్తించే బాధ్యత పార్టీ హైకమాండ్‌పై ఉందన్నారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడాలని పార్టీ హైకమాండ్‌ను కోరారు. 

తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు ఇంత మంది జనరల్ సెక్రటరీలు అవసరమా? అని  ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిండెట్‌లు లేరని అన్నారు. ఇవి దామోదర రాజనర్సింహ మాట్లాడుతున్న మాటలు కావని.. కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడుతున్న మాట అని చెప్పారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని.. అసలైన కాంగ్రెస్ వాదులమని.. పార్టీని కాపాడుకునే తపన ఉందన్నారు. తాము హైకమాండ్‌ను గౌరవిస్తామని.. అయితే ఆత్మ గౌరవానికి మించిదేమి లేదన్నారు. 

కోవర్టులను ప్రక్షాళన చేయాలని కోరారు. కోవర్టులు ఎవరనేది కార్యకర్తలకు కూడా తెలిసిపోయిందని అన్నారు. ఈరోజు కోవర్టులని మాట్లాడమని.. సమయం వచ్చినప్పుడు  వారి పేర్లను కూడా బయటపెడతామని చెప్పారు. కోవర్టిజం వల్ల నష్టపోతున్నామని చెప్పారు. పదవులు ఇచ్చే ముందు ఆ వ్యక్తి అర్హతల గురించి చూడాలని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios