మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి గోరుముద్దలు తినిపించిన విద్యార్ధి (వీడియో)
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చిన్నారులు గోరుముద్దలు తినిపించారు . పాలకుర్తి నియోజకవర్గంలోని గుర్తూరులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చిన్నారులు గోరుముద్దలు తినిపించారు. ఆయన కూడా తన ప్రోటోకాల్ పక్కనబెట్టి చిన్నారులతో కలిసిపోయారు. వివరాల్లోకి వెళితే.. .పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గుర్తూరులో తన కార్యక్రమాన్ని ముగించుకొని హరిపిరాలకు బయల్దేరారు. అయితే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు గోడలు పైకి ఎక్కి మంత్రిని చూస్తున్నారు. ఆది గమనించిన ఎర్రబెల్లి తన వాహనాన్ని దిగి అక్కడ వున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
మంచిగా చదువుతున్నారా...?, ఇప్పుడు స్కూల్‌లో ఏం చేస్తున్నారు..? మధ్యాహ్న భోజనం అందుతుందా....? అంటూ పిల్లలను ప్రశ్నించారు. వాటికి విద్యార్థులు సమాధానం చెప్తూ... భోజనం తింటున్నాం అని చెప్పారు. అదే స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న మంగళంపల్లి తేజ్ కుమార్ తింటుండగా... మంత్రి ఎర్రబెల్లి బువ్వ మంచిగున్నదా..! అని అడిగాడు. బాగుంది అని ఆ పిల్లాడు సమాధానం చెప్పాడు. మరి నాకు పెడతావా?! అని మంత్రి అడిగారు. దీంతో ఆ విద్యార్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి తన చేతితో గోరుముద్దలు తినిపించారు. చాలా బాగుంది బిడ్డ.. అంటూ ఆ చిన్నారిని ఆశీర్వదించిన దయాకర్ రావు తన పర్యటనకు బయలుదేరారు.