కుల కట్టుబాట్ల పేరుతో సొంతింట్లోకి రానివ్వకపోవడంతో రాత్రంతా స్మశానంలోనే జాగారం చేసిన దారుణ ఘటన కొత్తగూడెంలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం విజయలక్ష్మీనగర్‌లోని ఓ వ్యక్తి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి గుండెపోటుతో మరణించాడు. 

ఆ మృతదేహాన్ని కుల కట్టుబాట్ల పేరుతో తన ఇంటికే రానివ్వకుండా కులపెద్దలు అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు రాత్రంతా శ్మశానవాటికలోనే జాగారం చేశారు. 

వివరాల్లోకి వెడితే.. విజయలక్ష్మీనగర్‌ ఏరియాకు చెందిన శానం వేణుగోపాల్‌ (56), హైమావతి దంపతులు  పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. వేణుగోపాల్ ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం విధులు నిర్వర్తిస్తుండగా వేణు గోపాల్ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. 

దీంతో ఆయన స్వస్థలం విజయలక్ష్మీనగర్‌లోని ఇంటికి తీసుకురాగా.. వేణుకు కులంతో సత్సంబంధాలు తెగిపోయాయని, కుల కట్టడి చెల్లించని కారణంగా మృతదేహాన్ని గ్రామంలోకి గానీ, ఇంటికి గానీ తీసుకురావొద్దని కులపెద్దలు ఆంక్షలు విధించారు. దీంతో శ్మశాన వాటికలో గల డంపింగ్‌ యార్డు షెడ్డులో మృతదేహాన్ని దింపి.. కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా చలిలోనే శవ జాగారం చేశారు.

వేణు మృతదేహాన్ని గ్రామంలోనికి రానివ్వడంలేదన్న సమాచారం అందుకున్న అక్కడి సర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ సభ్యుడు సురేందర్, ఉప సర్పంచ్‌ తాండ్ర నాగరాజు, వార్డు సభ్యులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఇదే సమయంలో సమాచారం అందుకున్న మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో కుల పెద్దలు తమ బండారం బయటపడుతుందని భావించి మెల్లగా జారుకున్నారు. అనతరం కరోనాతో మృతి చెంది ఉంటాడని భావిచడం వల్లే గ్రామంలోనికి రానివ్వలేదని కులపెద్దలు మాటమార్చి అంత్యక్రియలకు హాజరయ్యారు.