పాడి ఫశువుల శరీర భాగాలను కోసుకుని తినడానికి ప్రయత్నించిన నలుగురు క్రూరుల బండారం బయటపడి గ్రామస్తుల చేతిలో ఒకడు తన్నులు తిన్నాడు.   

సిద్దిపేట: పాడి పశువులు బ్రతికుండగానే వాటి శరీరబాగాలను కోసి వండుకుని తిరనడానికి ప్రయత్నించారు నలుగు క్రూరులు. అయితే వారి బండారం బయటపడి గ్రామస్తుల చేతిలో ఒకడు తన్నులు తిన్నాడు. ఈ ఘోర సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ కు చెందిన ఓ వ్యక్తితో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ముగ్గురు పనిచేస్తున్నారు. వీరంతా వ్యవసాయక్షేత్రంలోనే నివాసముంటున్నారు.

అయితే గ్రామానికి చెందిన వెంకటేశం అనే వ్యక్తి తన పాడిపశువులను రాత్రి సమయంలోనే పొలం వద్దే వుంచేవాడు. ఈ విషయాన్ని గమనించిన నలుగురు యువకులకు అత్యంత క్రూరమైన ఆలోచన వచ్చింది. మాంసం వండుకుని తినాలని భావించిన ఈ నలుగురు అందుకోసం పాడిపశువులు బ్రతికుండగానే శరీర భాగాలను కోసేశారు. ఇలా రెండు గేదెల తొడభాగాలను పదునైన కత్తులతో కోసుకోగా తీవ్ర రక్తస్రావమై అవి చనిపోయాయి. 

పొద్దున వెంకటేశం పొలానికి వెళ్లగా రెండు గేదెలు రక్తపుమడుగులో చనిపోయి పడివున్నాయి. దీంతో అతడు గ్రామస్తుల సాయంతో ఈ దారుణానికి పాల్పడిన వారికోసం వెతకగా వ్యవసాయక్షేత్రంలోని నలుగురు యువకులు కనిపించారు. మాంసాన్ని వండేందుకు సిద్ధం చేసుకుంటున్న వారిలో ముగ్గురు నిందితులు గ్రామస్థులను చూసి పారిపోయారు. నేపాల్ కు చెందిన యువకుడు మాత్రం పట్టుబడ్డాడు. అతడిని చితకబాదిన గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.