నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. కన్న తండ్రే తన కూతురిని కాటేశాడు. మూడు నెలలుగా కన్న కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో జరిగింది. 

ఓ వ్యక్తి తన కూతురిని డిండిలోని ఓ పాఠశాలలో చదవిస్తున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూసేయడంతో బాలిక ఇంటికి వచ్చింది. కాగా, బాలికను తండ్రి బలవంతంగా లోబరుచుకున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. 

ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. దాంతో తనకు ఏమీ తెలియనట్లు భార్యతో కలిసి కూతురిని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కూతురిని నిలదీసింది. దీంతో తండ్రి చేసిన ఘాతుకం గురించి తల్లికి చెప్పింది. 

అయితే, ఆ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ తల్లీకూతుళ్లను శనివారం రాత్రి ఇంట్లో బంధించి చితకబాదాడు. తట్టుకోలేక బాలిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.