Asianet News TeluguAsianet News Telugu

Cyclone Gulab:ఉదయం లేచేసరికి... వరదనీటిలో చిక్కుకున్న సిరిసిల్ల కలెక్టర్ (వీడియో)

గులాబ్ తుఫాను తెలంగాణలో భీభత్సం సృష్టిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ను చుట్టుముట్టిన వరదనీటిలో ఏకంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ చిక్కుకున్నారంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుంది.   

Cyclone Gulab... Sircilla Collector Anurag Jayant Stuck In Flood Water
Author
Sircilla, First Published Sep 28, 2021, 1:16 PM IST

సిరిసిల్ల: గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో జలాశయాలు, చెరువులు ఉప్పొంగి వాగులు వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఏకంగా కలెక్టరేట్ కార్యాలయాన్ని వర్షపునీరు చుట్టుముట్టడంతో కలెక్టర్ అనురాగ్ జయంతి వరదనీటిలో చిక్కుకున్నాడంటే జిల్లాలో పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుంది. 

సిరిసిల్ల జిల్లాపై గులాబ్ తుఫాన్ ప్రభావం అధికంగా వుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా కుండపోత వర్షం కురుస్తుండటంతో ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితిని సమీక్షిస్తూ కలెక్టర్ అనురాగ్ జయంత్ సోమవారం రాత్రి కలెక్టరేట్ లోనే బస చేశారు. రాత్రి పడుకొని తెల్లవారి లేచిచూస్తే కలెక్టరేట్ చుట్టూ భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆయన బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

కలెక్టరేట్ చుట్టూ వరదనీరు తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే జేసిబి సాయంతో ఓ ట్రాక్టర్ లో కలెక్టర్ అనురాగ్ తో పాటు మిగతా సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.  

వీడియో

ఇలా వరదనీటిలోంచి బయటకు వచ్చిన కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలో వరద పరిస్థితిని పరిశీలించారు. భారీగా వర్షపునీరు చేటితో మునకకు గురయిన లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్ పర్సన్, పాలకవర్గంతో కలిసి కలెక్టర్ అనురాగ్ పర్యటించారు. నీటమునిగిన శాంతి నగర్ లో పర్యటించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని... అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని... ప్రస్తుత పరిస్థితుల్లో సహాయ చర్యలు చేపడుతున్న అధికారులకు సహకరించాలని కలెక్టర్ అనురాగ్ జయంత్ సూచించారు. 

read more  Cyclone Gulab: మరో రెండు రోజులు భారీ వర్షాలు... అప్రమత్తంగా వుండండి: మంత్రి గంగుల ఆదేశాలు

ఆది, సోమవారాలు తెలంగాణ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు సిరిసిల్లలో భీభత్సం సృష్టించాయి. ఇవాళ(మంగళవారం) కూడా ఈ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిరిసిల్లతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం కూడా రెండు రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. అయితే ఇవాళ కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు... కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది. దీంతో నగర ప్రజలతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.  

గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో 17.02 సెం.మీ, నిజామాబాద్ జిల్లా సిరికొండలొ 16.6సెం.మీ, కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 15.7సెం.మీ, ఖమ్మం జిల్లా ఇచ్చోడలో 15.15 సెం.మీ,  వర్షపాతం నమోదైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios