సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఫోటోని వాడుకుంటున్నారు. మీరు చదివింది నిజమే. గత ఆదివారం టీం ఇండియాతో పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సర్ఫరాజ్ నోరు తెరచి గట్టిగా ఆవలిస్తున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయ్యిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటోని పెట్టుకొని మన సైబరాబాద్ పోలీసులు వినూత్నంగా క్యాంపైన్ చేస్తున్నారు.

సర్ఫరాజ్ ఫోటో పెట్టి... నిద్ర వస్తున్న సమయంలో డ్రైవ్ చేయకండి అనే క్యాప్షన్ ని ఆ ఫోటోకి జత చేశారు.  ఈ ఫోటోని ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు. ఆ ట్వీట్ క్యాప్షన్ గా... ‘‘నిద్రవస్తున్నా.. ఆపుకొని మరీ బలవంతంగా డ్రైవింగ్ చేయకండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తున్నాయంటే అదే మీకు వార్నింగ్’’ అనే అర్థం వచ్చేలా పోస్టు చేశారు.

సర్ఫరాజ్ ఫోటో కూడా ఆవలిస్తున్నట్లుగానే ఉంది. అతని ఫోటోని కారులో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నట్లు మార్చి ఆ సమయంలో ఆవలిస్తున్నట్లు ఫోటో షాప్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సైబరాబాద్ పోలీసులకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.