ప్రజల సౌకర్యార్థం తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు జనాల ప్రాణాలమీదకి తెస్తోంది. చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం అక్కడికి చేరుకుంటున్నారు.

సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వేగంగా వస్తున్న వాహనాలను సైతం గుర్తించకుండా.. రోడ్డుపైనే ఆటలాడుతున్నారు. దీంతో కేబుల్ బ్రిడ్జి పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు.

శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వంతెన మూసివేస్తున్నట్లు తెలిపారు. మిగతా రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిని నిరాకరించారు.

తీగల వంతెనపై వాహనాల వేగం 35 కి.మీ మించకూడదని స్పష్టం చేశారు. తీగల వంతెన రెయిలింగ్‌పై కూర్చోవడం నిషేధమని పేర్కొన్నారు. వంతెనపై పుట్టిన రోజు, ఇతర వేడుకలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంతెనపై వాహనాలు నిలపడం, మద్యం సేవించకూడదని పోలీసులు స్పష్టం చేశారు.