సౌండ్స్ వద్దు, మైనర్లను అనుమతించొద్దు.. పబ్ యాజమాన్యాలకు తేల్చిచెప్పిన సైబరాబాద్ సీపీ
హైకోర్టు సూచించిన నిబంధనలకు లోబడి సౌండ్లు పెట్టాలని పబ్‌ల యాజమాన్యాలకు సూచించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర. పబ్‌లపై ఫిర్యాదులు వస్తున్నాయని.. చుట్టుపక్కల నివాసం వుంటున్న వారికి అసౌకర్యం కల్పించొద్దన్నారు.
హైదరాబాద్‌లో పబ్‌ల యాజమాన్యాలతో సమావేశమయ్యారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర. హైకోర్టు ఆదేశాలపై అవకాశాలు కల్పించారు. నిబంధనలకు లోబడి పబ్‌ను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అన్నారు సీపీ. పబ్‌లపై ఫిర్యాదులు వస్తున్నాయని.. చుట్టుపక్కల నివాసం వుంటున్న వారికి అసౌకర్యం కల్పించొద్దన్నారు. ఇక మైనర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించొద్దని హెచ్చరించారు రవీంద్ర. హైకోర్టు సూచించిన నిబంధనలకు లోబడి సౌండ్లు పెట్టాలన్నారు. అవసరమైతే పబ్‌లను సౌండ్ ప్రూఫ్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. అంతేకాదు కస్టమర్లను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు సీపీ.
ALso REad:రాత్రి 10 దాటితే నో సౌండ్ ... హద్దు మీరితే : పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇకపోతే... సెప్టెంబర్ 12న పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పది దాటితే పబ్స్‌లో ఎలాంటి సౌండ్ పెట్టరాదని స్పష్టం చేసింది. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతించాలని అధికారులను ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి సౌండ్ పెట్టొద్దని హైకోర్టు సూచించింది. పబ్‌లలో రాత్రిపూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇల్లు, విద్యాసంస్థలు వున్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతించారని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని అనుమతిచ్చారో .. ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.