హైదరాబాద్: బోధన్ పాస్‌‌పోర్టు స్కామ్ లో ఎనిమిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడ ఉన్నారు.

సోమవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఈ ముఠాకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.
నలుగురు బంగ్లాదేశ్ వాసులతో పాటు ఇద్దరు బోధన్ వ్యక్తులను ఈ కేసులో అరెస్టు చేసినట్టుగా సీపీ తెలిపారు. ఒకే ఇంటి చిరునామాతో 70 పాస్‌పోర్టులు జారీ అయినట్టుగా తమ దర్యాప్తులో తేలిందన్నారు.

పాస్‌పోర్టుల జారీలో పోలీసు అధికారుల పాత్రపై కూడ దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.పాస్‌పోర్టులు సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింకు బయటకు వచ్చిందని ఆయన తెలిపారు.

బంగ్లాదేశ్ కు చెందిన నెట్టిదాస్ అలియాస్ సంజీబ్, షెహనాజ్ పాయల్, మహ్మద్ రానా మియా, మహ్మద్ అసిబర్ రెహ్మాన్, పరిమళ్ బైన్, బెంగాల్ కు చెందిన సమీర్ , మనోజ్, నిజామాబాద్ కు చెందిన మథీన్ అహ్మద్, ముంబైకి చెందిన సద్దాం హుస్సేన్ లను అరెస్ట్ చేసినట్టుగా సీపీ  చెప్పారు.

ఈ స్కామ్ లో ఎస్ఐ పెరుక మల్లేష్ , ఎఎస్ఐ అనిల్ కుమార్ లను కూడ అరెస్ట్ చేశామన్నారు. పాస్ పోర్టుల స్కామ్ పై విచారణ చేసేందుకు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తామన్నారు.ఈ పాస్ పోర్టుల ద్వారా ఎంతమంది దేశం దాటి వెళ్లారనే విషయమై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.పాస్‌పోర్టుల వెరిఫికేషన్ లో లోపాలపై దృష్టి పెట్టినట్టుగా ఆయన చెప్పారు.