ఆన్ లైన్ లోన్ యాప్ లు తయారు చేసిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆన్ లైన్ లోన్ యాప్ లతో ఆత్మహత్యలు ఎక్కువవుతుండడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వరుస ఘటనలపై గట్టి నిఘా పెట్టారు. 

ఆన్ లైన్ లోన్ యాప్ తయారు చేసి అప్పులు ఇచ్చి యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ పూర్ లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో రెండ్రోజుల క్రితం సునీల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

యాప్ ద్వారా అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. రుణం చెల్లించలేదని కాంటాక్టు లిస్టులో ఉన్న వాళ్లందరికీ యాప్ నిర్వాహకులు వివరాలు పంపించారు. దీంతో పరువు పోయిందని భావించిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడు నాలుగు యాప్ లు సృష్టించి రుణాలు ఇస్తున్నట్టు గుర్తించారు. రహస్య ప్రాంతంలో యువకుడిని విచారిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతడి బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలను పరిశీలిస్తున్నారు. రుణయాప్ ల నిర్వాహకుల వేధింపులు తాళలేక రాస్ట్రంలో నెలరోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ లను నియంత్రించాలని పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.