హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇతరుల మృతికి కారణమయ్యే వారిని కఠినంగా శిక్షిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై ఐపీసీ 304 పార్ట్ -2 కింద కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ఈ సెక్షన్ల కింద నిందితులకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 

ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై  ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రష్యాలో చదువుతున్న ప్రియాంక అనే విద్యార్ధిని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించింది. హైటెక్ సిటీలోని ఐకియా చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమ్ దేవ్ అనే వ్యక్తి మరణించగా ఆయన భార్య చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఏ పబ్ లో మద్యం సేవించారో... మద్యం సేవించిన వారిని సురక్షితంగా ఇంటికి పంపించే బాధ్యతను కూడ పబ్ లే తీసుకోవాలని సీపీ సజ్జనార్  కోరారు.మద్యం మత్తులో వాహనాలు నడిపితే గతంలో కంటే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.