హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరద నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్ధితి ఎదురైనా 100 కి ఫోన్ చేయాలని సూచించారు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌.

ఆదివారం ఉదయం అధికారులతో కలిసి పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పహాడ్, నీట మునిగిన పలు కాలనీల్లో పరిస్థితిని సీసీ సమీక్షించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ‘ఇబ్బందిగా ఉన్నవాళ్లని పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా చెప్పామన్నారు.

వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Also Read:అమీన్‌పూర్ ఆనంద్ విషాదాంతం: ఐదు రోజుల తర్వాత కారులో దొరికిన డెడ్‌బాడీ

అవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. దయచేసి వర్షం, వరద నీటిలో వాహనదారులు సాహసాలు చేయొద్దని సజ్జనార్ సూచించారు. వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉన్నందున మళ్లీ వారిని బయటకు తీసుకురావాలంటే రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగాల్సి ఉంటుందని చెప్పారు.

నాలాల కబ్జాలపై అధికారులతో మాట్లాడామని... ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించే పనులు జరుగుతున్నాయని సజ్జనార్‌ తెలిపారు.