Asianet News TeluguAsianet News Telugu

అస్పష్టంగా ధోని ఫోటో... గుర్తించి మోసపోయిన తెలంగాణ కుర్రాడు

ఆ చిత్రంలో ధోనీ ఉండడంతో తెరపై ఉన్న నంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపించాడు. ఈనెల 14వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీకు కౌన్‌బనేగా కరోడ్‌పతి లాటరీలో బహుమతి వచ్చిదంటూ సొహైల్‌కు చెప్పాడు.  

cyber crime.. telangana youth cheated by the photo of ms dhoni
Author
Hyderabad, First Published Aug 22, 2018, 10:02 AM IST

ధోని ఫోటోని గుర్తించినందుకు ఓ తెలంగాణ కుర్రాడు రూ.1.38లక్షల సొమ్మును కోల్పోవాల్సి వచ్చింది. ధోని ఫోటోతో సైబర్ నేరగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకొని ఓ విద్యార్థి మోసపోయాడు.  ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మల్టీప్లెక్స్‌ టీవీ ఛానెల్‌లోని ఆటల పోటీల్లో ఎం.ఎస్‌.ధోనీని గుర్తించినందుకు రూ.12.60లక్షల నగదు బహుమతి ఇస్తున్నామంటూ సైబర్‌ నేరస్థులు ఖైరతాబాద్‌లో ఉంటున్న షేక్‌ సొహైల్‌ అనే విద్యార్థిని మోసం చేశారు. ఈనెల 12న ఇంట్లో టీవీ చూస్తున్న సొహైల్‌ మల్టీప్లెక్స్‌ ఛానెల్‌లో గేమ్‌ షోలో పాల్గొనాలనుకున్నాడు. 

తెరపై కన్పించే అస్పష్ట చిత్రాలను గుర్తించి వారి పేర్లను తమకు సంక్షిప్త సందేశం ద్వారా పంపితే బహుమతి ఇస్తామంటూ ప్రకటన వచ్చింది. ఆ చిత్రంలో ధోనీ ఉండడంతో తెరపై ఉన్న నంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపించాడు. ఈనెల 14వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీకు కౌన్‌బనేగా కరోడ్‌పతి లాటరీలో బహుమతి వచ్చిదంటూ సొహైల్‌కు చెప్పాడు.  

బహుమతి మొత్తాన్ని పొందేందుకు తొలుత రూ.1260 ఇస్తే చాలని చెప్పిన నిందితులు కస్టమ్స్‌, ఐటీ పన్ను అంటూ దశలవారీగా రూ.1.38లక్షల నగదు బదిలీ చేసుకున్నారు. బహుమతి మొత్తం ఎంతకీ రాకపోవడంతో సొహైల్‌ సదరు నెంబర్‌కు ఫోన్‌ చేయగా ఎవరూ స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన సొహైల్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios