CWC Meeting: హైదరాబాద్‌కు ఖర్గే, సోనియా, రాహుల్.. ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌లో నేడు, రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కేసీ వేణుగోపాల్, మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేతలు బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకోనున్నారు.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కూడా ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇదిలాఉంటే, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇక, మరి కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.