Asianet News TeluguAsianet News Telugu

తప్పని ‘క్యాష్‘ తిప్పలు

ఎక్కువమంది ఖాతాదారులు బ్యాంకుల నుండి కేవలం 100 రూపాయలు తీసుకోవటానికే ఇష్టపడుతున్నారు.

currency

కేంద్రప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో కోట్లాది మంది ప్రజలు డబ్బుల కోసం నానా అవస్తులు పడుతున్నారు. చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్ర నరేంద్రమోడి నాలుగు రోజుల క్రితం ప్రకటించిన సంగతి అందరికీ విధితమే. అప్పటి నుండి మొదలైన సామాన్యుల సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు గురించి 8వ తేదీ రాత్రి ప్రకటన వెలువడగా, 9వ తేదీన బ్యాంకులు పనిచేయవని, 9, 10 తేదీల్లో ఏటిఎంలు కూడా పనిచేయవని కేంద్రం ప్రకటించింది.

 అయితే కేంద్రం చెప్పినట్లు 10వ తేదీన బ్యాంకులు పనిమొదలు పెట్టినా సరిపడా డబ్బులు అందుబాటులో లేని కారణంగా రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఏ బ్యాంకు శాఖ ముందు చూసినా వందలకొద్దీ ఖాతాదారులు బారులుతీరి నిలబడ్డ దృశ్యం సాధారణమైపోయింది. అదే విధంగా 11వ తేదీ నుండి అన్నీ ఏటిఎంల్లోనూ డబ్బులు తీసుకోవచ్చని పలు బ్యాంకులు స్పష్టం చేసాయి. దానికితోడు 10వ తేదీ నుండి ఖాతాదారుల మొబైల్ ఫోన్లకే నేరుగా మెస్సేజ్ లు వస్తుండటంతో అందరూ అప్రమత్తమై ఉదయం నుండే ఏటిఎంలముందు చేరారు. అయితే కేంద్రం, బ్యాంకులు చెప్పినట్లు చాలా ఏటిఏంల్లో డబ్బులు పూర్తిస్ధాయిలో అందుబాటులో లేవు. దాంతో వందల మంది ఖాతాదారులు ఏటిఎంల్లో నుండి ఏకంగా రోడ్లపైకే బారులు తీరారు.

  అటు బ్యాంకుల్లోనూ సరిపడా డబ్బులు లేక, ఇటు ఏటిఎంల్లోనూ సరిపడినంత డబ్బును బ్యాంకులు ఉంచకపోవటంతో ప్రజలు నానా యాతనలు పడుతున్నారు. ఇంటి అద్దెలు ఇచ్చుకోవటం, పాల వాళ్ళకు చెల్లింపులు, కరెంటు, పెట్రోలు పోయించుకోవటం తదితర నిత్యావసరాలన్నింటికీ ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వచ్చిన డబ్బు కూడా కొత్తగా విడుదల చేసిన 2 వేలు, 500 రూపాయల నోట్లే. అప్పటికే బ్యాంకుల్లో ఉన్న 100 రూపాయలు కూడా కొంత మాత్రమే కావటంతో ప్రజల అవసరాలు ఏమాత్రం తీరటం లేదు. కొత్తగా వచ్చిన నోట్లను తీసుకోవటానికి ప్రజలు కూడా పెద్దగా ఉత్సాహం చూపటం లేదు.

  ఎందుకంటే, బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఖాతాదారులు 2 వేలు, 500 తీసుకున్నా బజారులో ఏవైనా కొనుగోలు చేసినపుడు షాపుల వారు ఇవ్వటానికి చిల్లర లేకపోవటమే కారణం. మార్కెట్ మొత్తం మీద 100, 50, 20, 10 రూపాయల చిల్లర చెలామణి దాదాపు ఆగిపోవటంతో ప్రజల అవస్తలు చెప్పనలవి కాకుండా ఉంది. పై కారణంతో ఎక్కువమంది ఖాతాదారులు బ్యాంకుల నుండి కేవలం 100 రూపాయలు తీసుకోవటానికే ఇష్టపడుతున్నారు. అందరూ 100 రూపాయలే అడుగుతుండటతో బ్యాంకుల్లో కూడా 100 రూపాయల డినామినేషన్ అయిపోయాయి. ఫలితంగా బ్యాంకులు గానీ ఏటిఎంల్లో గాని సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios