పోలీసులను ఆశ్రయించిన ఎన్నారై మహిళ ... బిఆర్ఎస్ ఎంపీ కేకే కొడుకులపై క్రిమినల్ కేసు
అధికార బిఆర్ఎస్ పార్టీ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వుండే నాయకుడు కే కేశవరావు కొడుకులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవ రావు కొడుకులపై కేసు నమోదయ్యింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన స్థలాన్ని అధికార పార్టీ ఎంపీ తనయులు కబ్జా చేసారని ఓ ఎన్నారై మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. తన సంతకాలను ఫోర్జరీ చేసి కాజేసారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీ కొడుకులు, హైదరాబాద్ మేయర్ సోదరులు విప్లవ్ కుమార్, వెంకటేశ్వర రావు లపై కేసులు నమోదు చేసారు.
విదేశాల్లో వుంటున్న ఓ ఎన్నారై మహిళకు హైదరాబాద్ లోని ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో స్థలం వుంది. ఈ స్థలంపై కన్నేసిన అధికార బిఆర్ఎస్ ఎంపీ కొడుకులు ఫోర్జరీ సంతకాలతో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సదరు ఎన్నారై మహిళ ఆరోపిస్తోంది. విదేశాల్లో వుండే తనకు స్థలం వేరే ఎవరి పేరుపైకో మారినట్లు ఆలస్యంగా తెలిసిందని... విచారించగా ఎంపీ కేశవరావు కొడుకులే కాజేసినట్లుగా బయటపడిందని తెలిపారు.
ఎన్నారై మహిళ ఫిర్యాదుతో ఎంపీ కేశవరావు కొడుకులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. నెల రోజుల క్రితమే కేకే కొడుకులిద్దరిపై కేసులు నమోదయినా పోలీసులు గోప్యంగా వుంచడంతో బయటపడలేదు. తాజాగా ఈ వ్యవహారం బయటపడటం దుమారం రేపుతోంది.