కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ ను అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు అరెస్టు చేశారు. అతనితో పాటు సుజయ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నిందితుడికి, సీఐకి మధ్య సుజయ్ మధ్యవర్తిత్వం వహించినట్లు ఏసీబీ అధికారులు తేల్చుకున్నారు. 

క్రికెట్ బెట్టింగ్ కేసులో తనకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.5 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని సీఐ జగదీష్ డిమాండ్ చేశాడని ఈ నెల 19వ తేదీన నిందితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆ వ్యక్తి తొలుత లక్షా 39 వేలు సీఐకి సమర్పించుకున్నాడు. 

ఏసీబీ అదికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు సీఐ జగదీష్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో పలు కీలకమైన ఆధారాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని లాకర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్న సుజయ్ బెట్టింగ్ కలెక్షన్లలో సీఐ జగదీష్ కు సహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లంచం కోసం తనను సీఐ తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాడని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.