హైదరాబాద్: భాగ్యనగరంలో నాణ్యత లోపించిన పిల్లర్స్ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. మెట్రో రైలు పెచ్చులూడి మహిళమృతి చెందిన విషయం మరవకముందే పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే భయాందోళనకు గురి చేస్తోంది.  

మెట్రో రైల్ పిల్లర్స్ పెచ్చులూడి మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే పగుళ్లు భయాందోళన కలిగిస్తోంది. ప్రముఖ సినీ మాటల రచయిత కోన వెంకట్ ఈ పగుళ్లకు సంబంధించి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కోన వెంకట్ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపించడం వల్లే పగుళ్లకు కారణమని ప్రభుత్వం మేల్కొనకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

అటు మంత్రి కేటీఆర్ కు సైతం ట్యాగ్ చేశారు కోనవెంకట్.  పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే 20వ నంబర్ పిల్లర్ పగుళ్లకు సంబంధించి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రమాదం జరగకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇకపోతే అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నంకు సమీపంలో ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ పగుళ్లు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది హెచ్ఎండీఏపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. 

మెహిదీపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే 20, 24,28 పిల్లర్లు, ఎయిర్ పోర్ట్ నుంచి మెహిదీపట్నం వైపు వచ్చే పిల్లర్ నంబర్స్ 8, 10ల వద్ద పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే 20వ నంబర్ పిల్లర్ కు భారీగా పగుళ్లు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. 

సోషల్ మీడియాలో పిల్లర్స్ కు పగుళ్లు అంటూ ఫోటో హల్ చల్ చేస్తుండటంతో హెచ్ఎండీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లర్స్ ను పరిశీలించారు. మోటార్ వాహనాలను మాత్రమే అనుమతించారు. అలాగే హెవీ మోటార్ వెహికల్స్ కు సంబంధించి నిబంధనలు అమలు చేశారు. 

మరోవైపు ఇంజనీరింగ్ నిపుణుల బృందం సైతం పిల్లర్స్ ను పరిశీలించింది. తక్షణమే ప్యాచ్ వర్క్స్ కు ఆదేశాలు జారీ చేశారు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్. ఇకపోతే మాటల రచయిత కోన వెంకట్ మంత్రి కేటీఆర్ కు ఫోటోను ట్యాగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ను కోరారు కోన వెంకట్.

దాంతో మంత్రి కేటీఆర్ కోన వెంకట్ ట్వీట్ పై స్పందించారు. సంబంధింత అధికారులతో మాట్లాడారు. పగుళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెయిలింగ్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. 

బాక్స్ గ్రిడర్స్ మధ్య ఉండాల్సిన గ్యాప్ సరిగ్గానే ఉందని దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అయితే రెయిలింగ్ మధ్య మాత్రం గ్యాప్ రావడంతో పగుళ్లు ఏర్పడినట్లు తెలిపారు. అందుక కొద్దిపాటి పనులు చేస్తే సరిపోతుందని బృందం తెలిపింది.