Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సీపీఎం నేతల భేటీ.. ఆ అంశాలపైన చర్చ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర సీపీఎం నేతలు భేటీ అయ్యారు. శుక్రవారమే ఈ భేటీ జరగాల్సినప్పటికీ అది చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈ రోజు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. 

CPM Leaders Meet CM KCR At Pragathi bhavan
Author
First Published Sep 3, 2022, 1:25 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర సీపీఎం నేతలు భేటీ అయ్యారు. శుక్రవారమే ఈ భేటీ జరగాల్సినప్పటికీ అది చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈ రోజు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వామపక్షాల మద్దతు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించగా.. తాజాగా సీపీఎం కూడా మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే సీపీఎం నేతలతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వారికి ఆహ్వానాన్ని పంపారు. 

ఈ క్రమంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర పార్టీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి‌లు సీఎం కేసీఆర్‌తో భేటీ కోసం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యుహాలతో పాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 17, బీజేపీ వ్యతిరేక పోరాటం, భవిష్యత్‌లో కలిసి పనిచేసే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. 

ఈ భేటీకి ముందు ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన తమ్మినేని వీరభద్రం.. టీఆర్ఎస్‌కు మద్దతు రాజకీయ ఎత్తుగడ అని చెప్పారు. టీఆర్ఎస్‌కు మద్దతిచ్చినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని చెప్పారు. తన కుటుంబంపై వచ్చిన హత్యా ఆరోపణలకు.. టీఆర్ఎస్‌కు మద్దతుకు సంబంధం లేదని అన్నారు. తాము హత్యా రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒకటేనని కాంగ్రెస్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిలబడుతున్నారని చెప్పారు. త్వరలో భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేయనున్నట్టుగా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios