Asianet News TeluguAsianet News Telugu

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు: ఖమ్మం కోర్టులో లొంగిపోయిన సీపీఎం నేత తమ్మినేని కోటేశ్వరరావు

తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు  ఇవాళ  ఖమ్మం కోర్టులో లొంగిపోయాడు. కోటేశ్వరరావుతో పాటు నాగయ్య అనే నిందితుడు కూడా కోర్టులో లొంగిపోయాడు. 

CPM Leader Tammineni koteswara rao Surrendered Before khammam Court
Author
First Published Sep 2, 2022, 11:52 AM IST


ఖమ్మం: టీఆర్ఎస్ నేత  తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు, నాగయ్యలు శుక్రవారం నాడు ఖమ్మం కోర్టులో లొంగిపోయారు.తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఏ-9గా తమ్మినేని కోటేశ్వరరావు ఉన్నారు. ఏ 10 గా నాగయ్య ను పోలీసులు చేర్చారు. తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిన రోజు నుండి తమ్మినేని కోటేశ్వరరావు , నాగయ్యలు పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మందిని పోలీసులు గత నెల 18న ఏపీలోని రాజమండ్రిలో అరెస్ట్  చేశారు.సీపీఎం తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడే తమ్మినేని కోటేశ్వరరావు.  హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య తమ్మినేని వీరభద్రం బాబాయి కొడుకే తమ్మినేని కృష్ణయ్య.

సుదీర్ఘకాలం పాటు సీపీఎంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య మూడేళ్ల క్రితంఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరారు. సర్పంచ్ పదవి విషయమై  తమ్మినేని కోటేశ్వరరావు కుటుంబంతో చోటు చేసుకున్న విబేధాల కారణంగానే తమ్మినేని కృష్ణయ్య సీపీఎంను వీడాడు. సర్పంచ్ ఎన్నికల సమయంలో తమ్మినేని కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశాడు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధవులు సర్ధి చెప్పడంతో కృష్ణయ్య నామినేషన్ ను వెనక్కి తీసుకున్నాడు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశాడు. అయితే  ఈ సమయంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ్మినేని కృష్ణయ్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి  తన భార్యను ఎంపీటీసీగా కృష్ణయ్య గెలిపించుకున్నారు. ఆ తర్వాత తమ్మినేని కృష్ణయ్య టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. దీంతో గ్రామంలో టీఆర్ఎస్, సీపీఎం మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది. గతంలో జరిగిన గ్రామ సభలోనే తమ్మినేని కోటేశ్వరరావు,తమ్మినేని కృష్ణయ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  

also read:తమ్మినేని కృష్ణయ్య హత్య ఎఫెక్ట్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి భద్రత పెంపు

ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా పొన్నెకల్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెల్దార్ పల్లికి తిరిగి వస్తున్న సమయంలో ప్రత్యర్ధులు తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారు. సీపీఎం శ్రేణులే తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం పోలీసులకు  మీడియాకు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తమ్మినేని కృష్ణయ్య తనయుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు ను అరెస్ట్ చేయాలని నిన్న  కృష్నయ్య మద్దతుదారులు, టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.ఈ ర్యాలీ నిర్వహించిన మరునాడే తమ్మినేని కోటేశ్వరరావు లొంగిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios