తెలంగాణ నుండి తమిళిసై వెళ్లిపోవాలి: సీపీఐ కార్యదర్శి కూనంనేని
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.తెలంగాణపై మోడీకి ఆకస్మాత్తుంగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్ధం కావడం లేదన్నారు
హైదరాబాద్:తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై సీపీఐ రాష్ట్రసమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. తమిళిసై గవర్నరో, బీజేపీ కార్యకర్తో అర్ధం కావడం లేదన్నారు.మంగళవారంనాడు హైద్రాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.తమిళిసై తెలంగాణ నుండి వెళ్లిపోవాలని ఆయన కోరారు. త్వరలోనే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని ఆయన చెప్పారు.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నతీరును ఆయన తప్పుబట్టారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ గతంలో గవర్నర్ వ్యవస్థలను ఎలా ఉపయోగించుకొని ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఎలా ఇబ్బంది పెట్టారో ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కేరళ, తెలంగాణ,ఢిల్లీ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు.
గవర్నర్ వ్యవస్థను పాలకులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు.ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.దురుద్దేశ్యంతోనే మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన విమర్శించారు.గత ఏడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించేందుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.మోడీ పర్యటనను అడ్డుకొంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కటి కూడ నెరవేర్చలేదని కూనంనేని సాంబశివరావు తెలిపారు.ఈ నెల 10వ తేదీ నుండి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ప్రచారం చేస్తామన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని కూనంనేని విమర్శించారు.