హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ముడిపడి ఉంది. ఆర్టీసీ సమ్మెపై చర్చతో పాటు  హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విషయమై పునరాలోచనలో సీపీఐ పడింది. 

ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చించనుంది.ఈ నెల 14వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశం కానుంది.ఈ సమావేశం తర్వాత సీపీఐ టీఆర్ఎస్ కు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు విషయమై స్పష్టమైన ప్రకటన చేయనుంది సీపీఐ.

ఈ నెల 1వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకొంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని సీపీఐ టీఆర్ఎస్ ను కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని  కోరింది.టీఆర్ఎస్ కు సీపీఐ డెడ్‌లైన్ పెట్టింది.

ఈ డెడ్‌లైన్ కూడ దాటిపోయింది. ఆర్టీసీ జేఎసీతో చర్చలకు ససేమిరా అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో  సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు విషయమై తాడో పేడో తేల్చుకోవాలని సీపీఐ భావిస్తోంది.

ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు హైద్రాబాద్ మగ్ధూంభవన్ లో  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై  ప్రధానంగా చర్చించనున్నారు.

ఆర్టీసీ సమ్మెను భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయమై  ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమ్మెలో  సీపీఐకు అనుబంధంగా ఉన్న ఎఐటీయూసీకి సంబంధించి ఎంప్లాయిస్ యూనియన్ కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐకు మద్దతిచ్చే విషయంలో  స్పష్టత ఇవ్వనుంది.

రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ లో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతును ఉప సంహరిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయమై  రాష్ట్ర  కార్యవర్గంలో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై చర్చించేందుకు పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా సమాచారం.

ఈ విషయమై సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ కు మద్దతిచ్చే విషయమై స్పష్టత ఇవ్వనుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడ పోటీ చేస్తోంది.టీఆర్ఎస్ కు మద్దతును ఉపసంహరించుకొని కాంగ్రెస్ కు సీపీఐ మద్దతిస్తోందా లేదా ఏ పార్టీకి మద్దతు ఇవ్వదా  అనే విషయమై కూడ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.