Asianet News TeluguAsianet News Telugu

సిపిఐ అమ్ముడుపోయింది, కెసిఆర్ ప్లాన్ ఇది: అశ్వద్ధామ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కెసిఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నిజంగా బాధ్యత కలిగి ఉంటె రాత్రి మమ్మల్ని చర్చలకు పిలవాలి కానీ ఇలా ఒంటెద్దుపోకడ ప్రదర్శించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

cpi sold itself to kcr: ashwatthama reddy
Author
Hyderabad, First Published Oct 5, 2019, 6:26 PM IST

హైదరాబాద్: తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మినీ సంగ్రామమే నడుస్తుంది.

విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు. 

ఈ సందర్భంగా ఏషియానెట్ న్యూస్ కు అశ్వద్దామ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వారు ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తమ సమస్యలపై స్పందించకుండా, తమను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తున్నా కామ్రేడ్లకు కనపడడం లేదా అని  కమ్యూనిస్టు నాయకులపై విరుచుకుపడ్డారు.

సిపిఐ పార్టీ కెసిఆర్ కు అమ్ముడుపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చాడ వెంకట్ రెడ్డి తన స్వలాభం కోసం ఇలా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు. 

తాము సమ్మె చేస్తుంటే సంఘీభావం కూడా తెలుపకుండా, తమను డిస్మిస్ చేస్తామని బెదిరిస్తున్న అధికార తెరాస తో చేతులు కలిపి సిద్ధాంతాలకు నీళ్లొదిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పక్షాన పోరాడి కార్మికులంతా ఏకం కండి వంటివాటిని నినాదాలకే పరిమితం చేసారని ఎద్దేవా చేసారు. 

కార్మికుల వ్యతిరేక ప్రభుత్వానికి సిపిఐ మద్దతెలా ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎమ్మెల్సీ పదవికోసమే ఇలా ప్రజా వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు మరో పోరాటానికి తాము దిగుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తమమాటను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తాము ఎవరి చేతుల్లో కీలుబొమ్మలం కాదన్నారు. 

కెసిఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నిజంగా బాధ్యత కలిగి ఉంటె రాత్రి మమ్మల్ని చర్చలకు పిలవాలి కానీ ఇలా ఒంటెద్దుపోకడ ప్రదర్శించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

ఆర్టీసీ ని ప్రైవేటీకరించాలని కెసిఆర్ భావిస్తున్నారని, ఆలా గనుక చేస్తే ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండకుండాపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తమ డిమాండ్లు తమ స్వలాభం కోసం కాదని, ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువచేసేందుకేనని ఆయన అన్నారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో తామంతా కెసిఆర్ కు బాసటగా సకలజనుల సమ్మెలో పాల్గొన్నామని, జైలుకు వెళ్ళమని గుర్తుచేశారు. తెలంగాణకు తొలిదశ మలిదశ ఉద్యమాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కెసిఆర్ వ్యతిరేక ఉద్యమం చేయవలిసిన అవసరం ఏర్పడిందన్నారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చిన కెసిఆర్ ఇప్పుడు అదే ఆర్టీసీని లేకుండా చేయాలనీ కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. 

మొక్కువోని ధైర్యంతో, కార్మికులు ఐకమత్యంతో ముందుకు వచ్చి పోరాటంలో కలిసి రావాలని కోరారు. ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశం డిపో మేనేజర్లకు ఉంటే వారంతా తమతో కలిసి రావాలని కోరారు. ప్రజలంతా తమకు బాసటగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios