Asianet News TeluguAsianet News Telugu

ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు.. ముత్తయ్య

విచారణ ముగిసిన కొద్దిసేపటికి మత్తయ్య కోర్టులోకి వచ్చారు. తనను కోర్టులోకి రానివ్వకుండా ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తన గుర్తింపు కార్డు లాక్కున్నారని, అందుకే లోనికి తొందరగా రాలేకపోయానని, తన కేసులో ఎవరినీ న్యాయవాదిగా పెట్టలేదని, తానే వాదిస్తానని కోరారు.

court orders in vote for money case.. telangana police give protection to muttaiah
Author
Hyderabad, First Published Oct 27, 2018, 10:22 AM IST

ఓటుకు నోటు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జెరూసలేం ముత్తయ్య పేరును కోర్టు తొలగించిన సంగతి తెలిసిందే. కాగా... ఇలా తొలగించడాన్ని సవాల్ చేస్తూ.. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. 

పోలీసు రక్షణ కోరుతూ తెలంగాణ డీజీపీకి మత్తయ్య దరఖాస్తు చేసుకుంటారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ నేతలు  కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్యను హైకోర్టు తొలగించడాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో 2016లో పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. తొలుత మత్తయ్య తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నానని, 2 వారాల సమయం కావాలని న్యాయవాది సుప్రియ నివేదించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీన్‌ పి.రావల్‌ వాదనలు వినిపిస్తూ అనేక కారణాలతో తరచూ వాయిదా అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తదుపరి తాను తప్పనిసరిగా కౌంటర్‌ దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపిస్తానని న్యాయవాది నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. 

ఇదిలా ఉండగా...విచారణ ముగిసిన కొద్దిసేపటికి మత్తయ్య కోర్టులోకి వచ్చారు. తనను కోర్టులోకి రానివ్వకుండా ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తన గుర్తింపు కార్డు లాక్కున్నారని, అందుకే లోనికి తొందరగా రాలేకపోయానని, తన కేసులో ఎవరినీ న్యాయవాదిగా పెట్టలేదని, తానే వాదిస్తానని కోరారు. ‘నాకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదు. ఈ కేసులో నా పాత్ర లేదు. దానిపై నేనే స్వయంగా వాదనలు వినిపించుకుంటానని న్యాయస్థానానికి విన్నవించుకున్నాను’అని తెలుగులో నివేదించారు.

 
అంతకుముందు మత్తయ్య తరపున హాజరైన న్యాయవాదిని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ప్రశ్నించగా పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ గుంటూరు ప్రభాకర్‌ ‘ఇదిగోండి.. నిన్న తానే నా చాంబర్‌కు వచ్చి మత్తయ్య సంతకం చేసి ఇచ్చిన కాగితం. నన్నే వాదించమన్నారు’అంటూ నివేదించారు. ‘నేను ఎవరినీ కలవలేదు. నేను అడ్వొకేట్‌ను పెట్టుకునే అవకాశం ఉంటే నేనే పార్టీ ఇన్‌ పర్సన్‌గా ఎలా వాదించుకుంటానని దరఖాస్తు పెట్టుకుంటాను’అని మత్తయ్య వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన న్యాయవాది వకాల్తాను ధర్మాసనం రద్దు చేసింది.

అంతేకాకుండా.. ముత్తయ్య కు తెలంగాణ పోలీసులు రక్షణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios