తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద మినిస్టర్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. దీనిమీద కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ కు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోర్టు ఆదేశించింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై గతంలో బండి సంజయ్ ట్వీట్ చేశారు. తనకు పరువు నష్టం కలిగించేలా బండి సంజయ్ ట్వీట్ చేశారని కేటీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పేలా బండి సంజయ్ ని ఆదేశించాలని కేటీఆర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్కు పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయవద్దని బండి సంజయ్ ను ఆదేశించింది. మీడియా, సామాజిక మాధ్యమాలు, సభల్లో కేటీఆర్ పై పరువునష్టం వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు పేర్కొంది. 

కాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటివద్ద శుక్రవారం భారీగా పోలీసులు మోహరించారు. బండి సంజయ్ జేబీఎస్ కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మోహరించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపడంపై బిజెపి శుక్రవారంనాడు నిరసనలకు పిలుపునిచ్చింది. జేబీఎస్ లో ప్రయాణికులతో ముఖాముఖీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఆపేందుకు పోలీసులు భారీ ఎత్తున బండి సంజయ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బండి సంజయ్ విమర్శించారు.

‘భారత్ రాష్ట్రీయ సమితి’ పేరుతో.. త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ? 19న తుది నిర్ణయం..!

ప్రశ్నించే గొంతులను, నిరసన గళాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అరెస్టులతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అంతకు ముందే జూన్ 9న తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఆ సమస్యల పరిష్కారంపై టిఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం.. రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం.. తదితర అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల కంట కన్నీరు కారుతుంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం పన్నీరు పారుతోందని ఆయన సెటైర్లు వేశారు.

రైతులకు రైతు బంధు పథకం నిధులు సకాలంలో విడుదల కాలేదని ఆరోపించారు. ఈ కాలంలో అందని రైతుబంధు వల్ల లాభం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేసిన బండి సంజయ్.. చాలా మంది రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పారు. అయితే పెట్టుబడి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితిని గమనించి తక్షణమే విడుదల చేయాల్సిన రూ.7,500కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.